మాతృభాషలోనే ఐదో తరగతి వరకు చదువు ఉండాలని కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించడంతో అందరి చూపు ఏపీ సర్కార్ వైపు పడింది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి.. కేవలం.. ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఏపీలో ఉంటుందని.. ప్రకటిస్తున్నారు. దాని కోసం.. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకే వెళ్తున్నారు. ఈ సమయంలో కేంద్రమే జాతీయ విద్యా విధానాన్ని మార్చేసింది. ఇప్పుడు.. జగన్ ఏం చేస్తారన్నది చాలా మందిలో ఆసక్తి కలిగిస్తోంది. న్యాయస్థానాలను లెక్క చేయనట్లే.. కేంద్రాన్ని కూడా లెక్క చేయకుండా.. ఉంటారా.. అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ లోపు ఆయనకు.. అనేక వైపు ల నుంచి సలహాలు వస్తున్నాయి.
విపక్ష పార్టీల నేతలు… తెలుగు మీడియం రద్దును వ్యతిరేకించేవారు అందరూ.. ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకోవాలని… జాతీయ విద్యా విధానం ప్రకారం.. ఐదో తరగతి వరకు.. తెలుగు మీడియంలోనే చదువు ఉండాలని.. ఆ తర్వాత కూడా.. విద్యార్థులు.. తల్లిదండ్రుల ఇష్టం మేరకే… మీడియం ఎంపిక ఉండాలి కానీ.. నిర్బంధంగా… ఇంగ్లిష్ మీడియం ఉండకూడదని అంటున్నారు. వైసీపీ నుంచి ఇవే తరహా సూచనలు సీఎంకు వెళ్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇంగ్లిష్ మీడియం ప్రతిపాదనను ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని సూచించారు.
ఊరందరిది ఓ దారి.. ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లుగా… ప్రపంచం అంతా ఓ దారి.. తనదో దారి అని జగన్ అనుకోవద్దని సెటైర్ వేశారు. చిన్న చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషను కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని హితవు పలికారు. ఎల్లాప్రగడ, సీవీ రామన్ మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మాతృభాష గురించి.. వైసీపీతో విబేధాలు రాక ముందే పార్లమెంట్లో మాట్లాడారు రఘురామకృష్ణరాజు. దానికి ఆయనను పిలిచి వివరణ తీసుకున్నారు జగన్. ఇప్పుడు.. అలాంటి వివరణలు అడిగే స్టేజ్ దాటిపోయింది.