వైకాపాతో ఎట్టి పరిస్థితుల్లో దోస్తీ ఉండదని భాజపా నేతలు చెబుతారు. తాము సొంతంగానే ఎన్నికలకు వెళ్తామని జగన్ కూడా ఏపీలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కుదరాల్సిన స్నేహం కుదిరిపోయిందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చిన అంశమే… వైకాపా ఎంపీల రాజీనామాల ఆమోద ప్రక్రియ! రాజీనామాలు చేసిన దగ్గర నుంచీ, ఆమోదించినంత వరకూ జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే.. వైకాపాకి భాజపా చేసిన సాయమేంటో స్పష్టంగా అర్థమౌతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసమే రాజీనామాలు చేశామని ఎంపీలు చెప్పారు! ఉప ఎన్నికలకు వెళ్తామనీ, తెలంగాణ ఉద్యమంలో తెరాస ఎలాగైతే రాజీనామాల ద్వారా ప్రజాభిప్రాయం తమకే ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేసిందో.. అదే తరహాలో పోరాటం చేస్తామని తాజా మాజీ ఎంపీల్లో ఒకరైన మిథున్ రెడ్డి ఈ మధ్యనే చెప్పారు. కానీ, వారికి అప్పటికే తెలిసిన విషయం ఏంటంటే.. ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావనేది! ఇంకా చెప్పాలంటే.. స్పీకర్ కు రాజీనామా పత్రాలు ఇచ్చిన రోజునే ఆఫ్ ద రికార్డ్ మీడియా మిత్రులతో ఈ ఎంపీలు చెప్పిన మాటేంటో తెలుసా… తమ రాజీనామాలు స్పీకర్ ఆమోదించే పరిస్థితి ఉండదన్నారు! సరిగ్గా ఇక్కడి నుంచే భాజపా సాయం మొదలైందని చెప్పాలి. పద్ధతి ప్రకారం ఎంపీలను స్పీకర్ ఓసారి పిలిచి కారణం తెలుసుకోవాలి. అది కూడా వెంటనే చెయ్యకుండా… చాలా సమయం తీసుకుని చేశారు. పునరాలోచనకు మళ్లీ ఓ వారం సమయం ఇచ్చారు. అప్పటికీ అంతిమ నిర్ణయం ప్రకటించకుండా… ఎప్పుడో ఏప్రిల్ లో రాజీనామాలు చేస్తే, జూన్ 20 వరకూ స్పీకర్ తీరుబడి లేదన్నట్టుగా ఇప్పుడు ఆమోదించారు.
ఈ క్రమంలో వైకాపాకి భాజపా సహకరించిన కోణం ఏంటంటే.. ఉప ఎన్నికలు వెళ్లే పరిస్థితి లేకుండా చేయడం! ఎందుకంటే, ఎలా చూసుకున్న వైకాపాకి ఉప ఎన్నికలకు అనవసర ప్రయాస అనేది వారికే అర్థమైన సత్యం కాబట్టి. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లి, ఐదు స్థానాలు గెలుచుకున్నా… ప్రత్యేక హోదా సాధన కోసం అది ఏ విధంగా పనికొస్తుందో వారికే తెలీదు! లేదూ.. ఒకటో రెండో స్థానాలు ఓడిపోయారే అనుకోండి… టీడీపీకి అంతకంటే బలమైన ప్రచారాస్త్రం మరొకటి ఉండదు. ఉప ఎన్నికల్లో ఐదింటికి ఐదూ సాధించినా ఫలితం సున్న. ఒకటే రెండో చేజారితే మరింత నష్టం. కాబట్టి, ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు రాని పరిస్థితిలో రాజీనామాలు ఆమోదం పొందితే వైకాపాకు ప్రచార వెసులుబాటు ఉంటుంది. సీఎం చంద్రబాబుపై మరిన్ని విమర్శలు చేసే అవకాశం దక్కుతుంది. సరిగ్గా ఆ రకమైన సాయమే వైకాపాకి భాజపా చేసిందనడంలో సందేహమే లేదు.
అయితే, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసినా… ఇన్నాళ్లపాటు ఆమోదించకుండా స్పీకర్ తాత్సారం చేయడం ఎంతవరకూ సబబు అనే చర్చ ఈ సందర్భంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పీకర్ స్థానంలో ఉండి, పరోక్షంగా ఉప ఎన్నికలు రానివ్వకుండా అడ్డుపడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమౌతుందా, అధికార దుర్వినియోగం కిందకు వస్తుందా అనే అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, వైకాపా ఎంపీల రాజీనామాల విషయంలో ఆ పార్టీకి సాయపడ్డ భాజపా విమర్శలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పీకర్ పాత్రపై ఆరోపణలు తప్పకపోవచ్చు.