ప్రత్యేక హోదా సాధన కోసమే రాజీనామాలు చేశామని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు. కానీ, ఇంతవరకూ వాటిని లోక్ సభ స్పీకర్ ఆమోదించలేదు. పునరాలోచించుకోవాలని ఇచ్చిన గడువు కూడా రేపటితో ముగుస్తుంది. దీంతో రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అనేది తేలిపోతుంది. ఇదే అంశమై వైకాపా ఎంపీ మిథన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశామనీ, వీటిని ఆమోదిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రకాలుగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు!
తాము కూడా రాజీనామాలు చేసి, ఢిల్లీలో పోరాటం చేశామనీ, అవిశ్వాస తీర్మానం పెట్టామనీ చెప్పారు. తమకు ఉన్న చివరి అస్త్రంగా రాజీనామాలు చేసి, ఉప ఎన్నికలకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో కేంద్రానికి తెలియజెయ్యొచ్చన్నారు! తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు ఏవిధంగా పనిచేశాయో, అదే తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమంలో రాజీనామాలు పనిచెయ్యాలన్న ఉద్దేశంతోనే తాము చేశామన్నారు. పదవులున్నా లేకపోయినా ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం చేస్తామని మిథున్ రెడ్డి చెప్పారు.
హోదా సాధన ఉద్యమం కంటే, ఉప ఎన్నికలపై వారికి శ్రద్ధ ఎక్కువ అనేది మిథున్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగానే ఉంది. ఇక, తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు ఎలా పనిచేశాయో, ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా అలానే పనిచేస్తాయని ఆయన చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది! తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమానికీ, వైకాపా చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటానికీ సాపత్యం ఎక్కడుంది..? తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు అనేది ఒక రకమైన ప్రయత్నం. దీంతోపాటు, ప్రజా పోరాటాలు, అన్ని పార్టీలను సమన్వయ పరిచే వేదికలు, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగాయి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే మార్గాలన్నింటినీ నాడు వినియోగించుకున్నారు. కానీ, ఇప్పుడు వైకాపా చేస్తున్న హోదా పోరాటంలో రాజీనామాలు అనేది ఏకైక అస్త్రం.. అదే చివరి అస్త్రం అని వారంటున్నారు! పోనీ, ఆ అస్త్ర ప్రయోగంలోనైనా చిత్తశుద్ధి ఉందా.. అంటే, వెతుక్కోవాల్సిందే! ఏ కేంద్రంపై అయితే హోదా కోసం పోరాటమని రాజీనామాలు అంటారో.. అదే భాజపా సర్కారుతో దోస్తీ కోసం దొడ్డిదారిన ప్రయత్నిస్తుంటారు. హోదా ఇవ్వని కేంద్రంపై కనీసం విమర్శలైనా చేశారా..?
ఎక్కడి తెలంగాణ ఉద్యమం, ఎక్కడ వైకాపా హోదా ఉద్యమం! తమ రాజీనామాలు కూడా తెలంగాణ ఉద్యమం నాటి రాజీనామాల తరహా ప్రభావం చూపిస్తాయని అన్నంత మాత్రాన.. వైకాపా ఎంపీల పోరాటానికి ఆ స్థాయి వచ్చేస్తుందా..? వైకాపా ఉద్యమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే కోణమేదీ..? వైకాపాతో భాజపా ఉక్కిరిబిక్కిరి అయిపోయిన పరిస్థితి ఉందా.. అలాంటిది ఊహించగలమా..?