ప్రత్యేకహోదా కోసం.. పదవులు త్యాగం చేసేశామని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. “చిత్తశుద్ధి” అనే మాటను ప్రతి పదానికి ముందూ వెనుకా జోడించి… రాజీనామాల విషయంలో…తమ సిన్సియార్టీని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. రాజీనామాలకు భయపడి పారిపోయారన్నారు. ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా. గుల్ల కింద కొడతామని హెచ్చరికలు పంపారు. జగన్ మీడియా అయితే.. ఇప్పటికే ఆమోదించాశారన్ని ప్రచారాన్ని ఓ రేంజ్లో చేసింది. జగన్ కూడా.. టెంపో ఏ మాత్రం తగ్గకుండా… రాజీనామాలు, ఉపఎన్నికలపై చాలెంజ్‌లు చేశారు.
ఇవన్నీ.. ఇంకా … ఏపీ ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఈ లోపే.. వైసీపీ గాలి తీసేసే కబురు వచ్చేసింది. అదే.. లోక్‌సభ స్పీకర్ రాజీనామాలు ఆమోదించకుండానే… అసలు ఏ నిర్ణయం తీసుకోకుండానే… విదేశీ పర్యటనకు వెళ్లిపోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలపై మొదటి నుంచి టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉపఎన్నికలు రాకుండా చూసుకుని… ప్రత్యేకహోదా కోసం పదవులు వదులుకున్నట్లుగా… త్యాగరాజుల కీర్తి పొంది.. సాధారణ ఎన్నికల్లో సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ – బీజేపీ కలసి ఈ నాటకాలు ఆడుతున్నాయన్నారు. దీనికి తగ్గట్లుగానే స్పీకర్ మహాజన్.. ఉపఎన్నికలు రాని తేదీని చూసి ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఆమోదిస్తామని.. వైసీపీ ఎంపీలకు కూడా చెప్పినట్లున్నారు. అందుకే కాన్ఫిడెన్స్ చూపించారు.
కానీ తర్వాత స్పీకర్ ఎందుకు మనసు మార్చుకున్నారో వారికి కూడా అర్థం కాలేదు. రీకన్ఫర్మేషన్ లేఖలు అడిగితే ఇచ్చారు. అయినా సుమిత్రా మమహాజన్ నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాలు ఆమోదించుకోవడం చేతకాని వాళ్లని కొంత మంది.. బీజేపీతో కుమ్మక్కయి.. డ్రామాలాడుతున్నారని మరికొంత మంది వైసీపీ ఎంపీల మొహం మీదే విమర్శలు చేస్తున్నారు. తమపై వస్తున్న విమర్శలను వారు మీడియా ముందు చెప్పుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ప్రజలు, టీడీపీ నేతలు తాము డ్రామాలాడుతున్నామంటున్నారని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని కోరామని.. చెప్పుకొచ్చారు. కానీ స్పీకర్ మాత్రం వీరి మొర ఆలకించలేదు.
వైసీపీ ఎంపీల రాజీనామాల విషయంలో బీజేపీ వేరే ఆలోచనల్లో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసినా ఉపఎన్నికలు రావు. పది రోజుల తర్వాత స్పీకర్ స్వదేశానికి వస్తారు. అప్పుడు మళ్లీ ఎంపీలను పిలిపించి మాట్లాడటమో.. లేకపోతే.. రీకన్ఫర్మేషన్ లెటర్లను కన్ఫర్మ్ చేసుకుని ఆమోదించడమో చేస్తారని స్పీకర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.