టీఆర్ఎస్ కోటాలో తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ సీటిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దానికి ప్రతిఫలంగా తెలంగాణ నుంచి హెటోరో పార్థసారధిరెడ్డిని కేసీఆర్ రాజ్యసభకు ఎన్నిక చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. రెండేళ్ల పదవి కాలం ఉన్న రాజ్యసభ సీటు ఒకటి ఉంది. దానికి కేటాయిస్తారా లేకపోతే.. పూర్తి స్థాయి పదవి కాలం ఉన్న సీటు కేటాయిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సీటును ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి ఆఫర్ చేస్తే ఆయన తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్కు ఉన్న మూడు సీట్లకు ముప్ఫై మంది ఆశావహులు ఉన్నారు. అత్యంత సీనియర్లే. అందరికీ కేసీఆర్ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన వాళ్లే. ఆ ఆశ చూపి పార్టీలో చేర్చుకున్న వాళ్లే. వారందరినీ కాదని.. వైసీపీతో బంధుత్వాలున్న హెటెరో రెడ్డికి చాన్సిస్తే మాత్రం… కేసీఆర్, జగన్ పరస్పర అవగాహనతో కుండమార్పిడి పద్దతిలో సీట్లు మార్చుకున్నారని అనుకోవచ్చు.
అలా ఎందుకు చేస్తారు నేరుగానే ఇవ్వొచ్చు కదా అనే డౌట్ రావొచ్చు.. కానీ ఏపీ నుంచే హెటెరో రెడ్డికి చాన్సిస్తే.. మూడు రెడ్లకు ఇచ్చినట్లవుతుంది. అప్పుడు వారు చెప్పే సామాజిక సమీకరణాలు తేడా కొడుతుంది. అందుకే ఇలా కులాల గేమ్ కోసం ఇలా సీట్లు మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.