వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు.. తమ పదవులకు రాజీనామాలు చేశారు. తర్వాత ఏం చేయాలో తెలియక .. ఏమీ చేయడం లేదు. పార్లమెంట్ సమావేశాల మొదట్లో.. టీడీపీ ఎంపీలు సభలో ఉండి మైలేజ్ పొందుతూండటంతో.. కనీసం తాము బయట ఉండి అయినా ప్రజల దృష్టిలో పడదామనుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. పైగా.. రాజీనామాలు చేసి… పార్లమెంట్ బయట నిలబడి ధర్నాలు చేస్తే ఏమొస్తుందన్న విమర్శలు వచ్చాయి. దాంతో ఎంపీలు ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ అక్కడ కనిపించలేదు. నియోజకవర్గాలలోనూ కనిపించలేదు. జగన్‌తోనూ సమావేశం కాలేదు.
అయితే ఎంపీ పదవులకు రాజీనామాలు తమ ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. పదవులకు రాజీనామాలు చేసినా… తమ బాధ్యతలు మాత్రం నిర్వహిస్తున్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ వరప్రసాద్ అందుకే ఢిల్లీలో వాలిపోయారు. ఎవర్నీ కలుస్తున్నారో.. ఎందుకు కలుస్తున్నారో కానీ… తాను సిన్సియర్‌గా ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్నాని చెప్పుకునేందుకు మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రులందర్నీ కలుస్తున్నానని..తన నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం.. అధికారులను కలుస్తున్నామని చెప్పుకున్నారు. ఓఎన్జీసీ అధికారులను కలిసి వాటర్ ప్లాంట్లు, ఆరోగ్యమంత్రిని కలిసి రుయా, స్విమ్స్లకు చెరో రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరామంటున్నారు. ఎంపీని కాకపోయినా నిధుల కోసం అందరి చుట్టూ తిరుగుతున్నానని..అది తన సిన్సియార్టీ అన్నారు.
వరప్రసాద్ ఒక్కడే ఢిల్లీకి వచ్చారు. ఇతర ఎంపీలు ఎవరూ రాలేదు. మామూలుగా వైసీపీ మాజీ ఎంపీలు.. కలసి కట్టుగా కార్యక్రమాలు ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం మిగతా నలుగురు ఎంపీలు రాలేదు. తమతో ఒత్తిడి చేసి మరీ రాజీనామాలు చేయించారన్న అసంతృప్తి ఎంపీల్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎంపీలపై ఒత్తిడి పెరుగుతోంది. సమస్యలు పరిష్కరించకుండా.. పదవులు వదిలేయడం ఏమిటన్న ప్రశ్న వారికి ప్రధానంగా ఎదురవుతోంది. అందుకే పదవులు వదలిసేసినా… ఎంపీ స్థాయిలో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు వరప్రసాద్ తన నియోజకవర్గానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం.. ఢిల్లీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తమ రాజీనామాలు తప్పేనని.. వరప్రసాద్ పరోక్షంగా తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు.