తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి భేటీ హైదరాబాద్ లో జరిగింది. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగానే జగన్ ను కేసీఆర్ పంపారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ భేటీ అనంతరం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రెంట్ దిశగా మొదటి దఫా చర్చలు ఈరోజు జరిగాయనీ, అవసరమైతే మరో రెండు దఫాల చర్చలు ఉంటాయన్నారు. వివిధ అంశాలపైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రాకు సంబంధించినంత వరకూ తమకు ప్రత్యేక హోదా ప్రధానమైందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు జగన్ గతంలో చెప్పారనీ, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరైతే ప్రత్యేక హోదా కల్పిస్తారో ఆ పార్టీకే మద్దతు ఇస్తామని అన్నారన్నారు విజయసాయి. అది ఎవరైనా కావొచ్చనీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కావొచ్చనీ, ఎన్డీయే ఇప్పటికే ఇవ్వమని స్పష్టంగా చెప్పారనీ, థర్డ్ ఫ్రెంట్ ఏదైనా ఉందంటే అదీ ఇస్తామంటే వారితో కావొచ్చనీ… ఎవరైనా తమకు ప్రధానమైంది ప్రత్యేక హోదా అని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా కేంద్రంలో పాలిస్తున్న సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కుల్ని హరించాయన్నారు. రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదన్నారు.
కేసీఆర్ లో ప్రత్యేక హోదా ఇస్తామనే చిత్తశుద్ధి హటాత్తుగా దర్శనమిచ్చేసినట్టు విజయసాయి మాట్లాడుతున్నారు. ఏపీకి హోదా ఇస్తే మాకూ కావాలంటూ మొన్నటి ఎన్నికల్లోనే కదా కేసీఆర్ చెప్పిందీ, హరీష్ రావూ చెప్పింది! సరే… ఓకే, హోదా ఎవరిస్తే వారికే మద్దతు అంటున్నారు విజయసాయి! అంటే, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వగలిగే స్థాయి, జాతీయ రాజకీయాల్లో కీలకమైన స్థాయిని తెరాసకు విజయసాయి కట్టబెట్టేసినట్టే! తెరాస ఆ స్థాయికి ఎదిగితే మంచిదే… కానీ, ఆ దిశగా కేసీఆర్ చేసిన ప్రయత్నాలేవీ ముందుకు కదలని వాస్తవం కళ్లముందు ఉంది కదా! ఫెడరల్ ఫ్రెంట్ అనే ఆలోచనకు ఎక్కడా మద్దతు దక్కని పరిస్థితి ఉంది. అలాంటిది, కేసీఆర్ హోదాకి అనుకూలంగా ఉన్నారని చెప్పడం వల్ల ఏం ఉపయోగం..? ఇంకోటి… గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రాల హక్కుల్ని కేంద్రంలోని ప్రభుత్వాలు హరించాయన్నారు. ఇప్పుడు ఆంధ్రా విషయంలో భాజపా చేసింది కూడా అదే కదా! ఆ రకంగానే ఆంధ్రా మోసపోయింది. అందుకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. కానీ, ఆ పోరాటం దగ్గరకి వచ్చేసరికి… టీడీపీని వైకాపా ఎందుకు విమర్శిస్తున్నట్టు..?
అంతేకాదు… దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పెళ్లి చేసుకుని, వదిలేసిన రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని కూడా విజయసాయి తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే, వారు ఇప్పుడు చేస్తున్న రాజకీయం విలువలకు కట్టుబడిందట! సీమాంధ్రుల చేతిలోకి తెలంగాణ పాలన వెళ్లొద్దని విభజించి విమర్శించిన కేసీఆర్ తో కలిసి వెళ్లడమేనా వైకాపా కట్టుబడ్డ విలువలు అంటే..?