వైఎస్ఆర్సిపి పార్టీ 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ లో ఉన్న నేతలకు విపక్షాల నేతలతో కంటే సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత ఎదురవుతుండడం, అది కాస్తా కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య రోజా కి తన సొంత నియోజకవర్గం లోని ఇతర వైఎస్సార్సీపీ నేతలకు మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కు, అదే పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని కి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వైఎస్ఆర్సిపి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట లో ఏర్పాటు చేసిన శివ ప్రభ లు తిలకించడానికి వచ్చారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన రజనీ కి సమాచారం ఇవ్వకుండా ఎంపీ ఎలా వస్తారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆయనను అడ్డుకున్నారు. ఎంపీని అడ్డుకోవడంతో ఆయన అనుచరులు కూడా రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరుల తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు , తోపులాటకు దారి తీసింది. ఎంపీ కృష్ణదేవరాయలు ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే రజినీకి తన ప్రాంతంలోని పార్టీ ఇన్చార్జి తో కూడా ఇటువంటి విభేదాలే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏదిఏమైనా వైఎస్ఆర్సిపిలో నేతలు ఇతర పార్టీల తో కంటే తమ సొంత పార్టీ నేతల తోనే ఎక్కువ గొడవలు పడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.