వైసీపీ ఎంపీలకు చాలా కట్టుబట్లు ఉంటాయి. ఎవరూ ఎవర్నీ కలవకూడదు. అలా కలవాలంటే అనుమతి తీసుకోవాలి. టీడీపీ ఎంపీలు వ్యక్తిగత శత్రువులే. వారిని అసలు కలవకూడదు. అందుకంటే ఇప్పటి వరకూ అలా టీడీపీ ఎంపీల్ని కలిసిన వారు తక్కువే.కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తోంది. వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయులు.. తమ పార్టీతో కంటే.. టీడీపీ ఎంపీలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం టీడీపీ ఎంపీలతో కలిసి కనిపించారు. అంతేకాకుండా టీడీపీతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలతో కలిసి ఆయన నేరుగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్ మోహన్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంత మంది యువ ఎంపీలు కూడా ఉన్నారు.
టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావులతో పాటు డీఎంకేకు చెందిన ఎంపీలు కనిమొళి, తమిజాచ్చి తంగపాండియన్, కథిర్ ఆనంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే తదితరులు కూడా ఉన్నారు. వారందరికీ కేశినేని నాని విందిచ్చారు. ఇలాంటి విందులకు వెళ్తున్నట్లుగా వైసీపీ హైకమాండ్‌కు తెలిస్తే కృష్ణదేవరాయులకు అపాయింట్మెంట్లు కూడా దొరకవని వైసీపీలో గుసగసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయనను పక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు.