వంచనపై గర్జన అంటూ అనంతపురంలో వైకాపా నేతలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైకాపా మాజీ ఎంపీలు మాట్లాడుతూ తాము చేసిన రాజీనామాల గురించి ఘనంగా చెప్పుకున్నారు. హోదా కోసం రాజీనామాలు చేయడం చాలా గర్వంగా ఉందని మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాలు నిర్ణయానికి ముందు జగన్ తమతో మాట్లాడారనీ… పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాలనీ, గత నాలుగేళ్లుగా పోరాటం చేశామనీ, ఇప్పుడు చివరి అస్త్రంగా పదవులు వదులుకోవాలనీ, ప్రజలకు అక్కరకు రాని పదవులతో పనేముందని జగన్ చెప్పారన్నారు. జగన్ తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయాల్లో ఇదీ ఒకటని మెచ్చుకున్నారు. జగన్ మాట తప్పని నాయకుడు కాబట్టి, ప్రత్యేక హోదా తెచ్చి తీరతారని మాజీ ఎంపీ అన్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… నాలుగేళ్లుగా భాజపాని చంద్రబాబు ఏమీ అనలేకపోయారన్నారు. హోదా గురించి మోడీని చొక్కా పట్టుకుని అడిగేంత ధైర్యం సీఎంకి లేదన్నారు. మరో నేత భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాడుతున్న నేత జగన్ అని కొనియాడారు. ప్రజల గురించి చంద్రబాబు ఒక్కరోజు కూడా ఆలోచించింది లేదన్నారు. హోదా విషయంలో ఎ1 చంద్రబాబు అనీ, ఏ2 మోడీ అని మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. తాము ఆంధ్రా ప్రయోజనాలు కోసమే పదవుల్ని త్యాగాలు చేశామన్నారు. ఇలా ఆ సభలో పాల్గొన్న ప్రముఖ నేతలంతా… హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు వైఖరే అని విమర్శించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీపైగానీ, భాజపాపైగానీ తీవ్రంగా ఎవ్వరూ విమర్శ చెయ్యలేకపోయారు! నామ్ కే వాస్తే మోడీ పేరు ప్రస్థావన తీసుకొచ్చినా ఫోకస్ అంతా చంద్రబాబుపై విమర్శలపైనే పెట్టారు.
తాము చేసిన రాజీనామాలు గ్లోరిఫై చేసుకోవడానికీ, వచ్చే ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ ఇస్తే హోదా సాధించి తీరతామన్న ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వంచనపై గర్జన సభ పరిమితమైంది. అంతేగానీ… రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం తీరుపై పోరాటం అనే యాంగిల్ ఎక్కడా కనిపించలేదు. ప్రజల కోసం ఎక్కడి వరకైనా వెళ్తామనీ, ఏ స్థాయి పోరాటమైనా చేస్తామని వైకాపా మాజీ ఎంపీలు ప్రసంగించడం మరీ విడ్డూరంగా ఉంది..! హోదా కోసం ఇంకెంతవరకూ వెళ్లగలరు..? చేయాల్సిన రాజీనామాలు చేసేశారు. చట్టసభలో ఉంటే కదా.. ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనూ అంతే… ఎమ్మెల్యేలు శాసన సభకి రారు, కానీ ప్రజా సమస్యలపై పోరాటం అంటారు! ఎంపీలు రాజీనామాలు చేసేశారు… ఇప్పుడు హోదాపై ఎంత దూరమైనా వెళ్తారంటారు! ప్రజాప్రతినిధులుగా నిర్వర్తించాల్సిన కనీస బాధ్యతల నుంచి తప్పుకున్నాక… పోరాటాలంటే వాటిలో ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుందీ..? ఈ మూడో గర్జన సభ.. జగన్ నాలుగేళ్ల పోరాటాన్ని మెచ్చుకోవడానికీ, ఎంపీల రాజీనామాలు అద్భుతః అనే స్వోత్కర్షకు మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు.