రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో దాదాపుగా ఆరుగు ఎంపీలతో.. ఓ న్యాయవాదితో కూడిన బృందం … ఢిల్లీకి వెళ్లింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో.. ఇరవై నిమిషాల పాటు స్పీకర్ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు లేఖ ఇచ్చారు. తమ వాదన కూడా వినిపించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి…రఘురామకృష్ణంరాజుపై మండిపడ్డారు. జగన్ నాయకత్వాన్ని బొచ్చులో నాయకత్వం అనడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
రఘురామకృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని .. పార్టీ నేతలను అసభ్యపదజాలంతో దూషించి .. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విపక్షపార్టీల నేతలతో రఘురామ కృష్ణరాజు లాలూచీ పడ్డారని … ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయకుండా.. బహిరంగంగా మాట్లాడటం పార్టీ నిబంధనలను ఉల్లంఘించడమేనని తేల్చారు. కేసులు, రాజకీయలబ్ధి కోసం .. ఎవరితో కలిసి ఇదంతా చేస్తున్నారో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. వైసీపీలో రఘురామకృష్ణరాజు మనస్ఫూర్తిగా లేరన్నారు. రఘురామకృష్ణంరాజు పై చర్యల విషయంలో స్పీకర్ తాను అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రఘురామకృష్ణంరాజు ఇటీవలి కాలో భారతీయ జనతా పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రధాని మోడీని అదే పనిగా పొగుడుతున్నారు. పైగా మోడీ వద్ద ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనర్హతా వేటు అనేది.. స్పీకర్ విచక్షణ పరిధిలో ఉంటుంది. సాధారణంగా.. ఏదైనా సందర్భంలో ఓటింగ్ జరిగినప్పుడు.. విప్ ఉల్లంఘించినప్పుడు మాత్రమే పార్టీలు… అనర్హతా పిటిషన్లు వేస్తూంటాయి. స్పీకర్లు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సందర్భం ఏమీ లేకపోయినా… వైసీపీ.. నర్సాపురం ఎంపీపై అనర్హతా పిటిషన్ వేసింది. ప్రస్తుత పరిణామాలను చూస్తే.. స్పీకర్ ఇప్పుడల్లా నిర్ణయం తీసుకోవడం కష్టమన్న ప్రచారం జరుగుతోంది.