విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం.. తామే అవిశ్రాంతంగా పోరాడుతున్నామని నిన్నామొన్నటిదాకా చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడంతా కుట్ర అంటూ… జరుగుతున్న పరిణామాల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేసేస్తున్నామని ప్రకటించారు. ఉపఎన్నికలు రాని తేదీలను చూసి ఆమోదించుకున్నారు. ఈ పరిణామంతో… అసలు బీజేపీతో పూర్తి స్థాయిలో కుమ్మక్కయ్యారన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు… పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపైనే అవిశ్వాసం చర్చకు వస్తోంది. ఇలాంటి సమయంలోనే.. వైసీపీ ఎంపీలు సభలో లేకుండా పోయారు. వారు సభలో లేకపోవడం.. కచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. రాజీనామాలు చేయడం వల్ల వారు సాధించిందేమిటన్న చర్చ ప్రజల్లో వస్తుంది. అదే సమయంలో… తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలన్న డిమాండ్ కూడా… సహజంగా చర్చకు వస్తుంది. టీడీపీ ఎంపీలపై ఒత్తిడి చేసి.. వారితోనూ రాజీనామాలు చేయిస్తే.. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఏపీ తరపున పార్లమెంట్ లో ఎవరుండేవారున్న ఆలోచన.. ప్రజల్లోకి రావడం ఖాయమే. వైసీపీ వ్యూహాలన్నీ బీజేపీని గట్టెక్కించడానికేనన్న భావన తెచ్చేందుకు టీడీపీ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తోంది. ఇది వైసీపీని మరింతగా కార్నర్ చేయనుంది.
రాజీనామా చేసిన ఎంపీలు.. పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు… పోరాటంతో.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించబోతున్నారని.. ముందుగానే గ్రహించారు. అందుకే … మాజీ ఎంపీలనే హోదాతో … తొలి రోజే పార్లమెంట్ కు వచ్చారు. గాందీ విగ్రహం వద్ద ధర్నాకు దిగబోయారు. కానీ మార్షల్స్ అడ్డుచెప్పడంతో.. ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభలో ఉన్న ఇద్దరు సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిలబడితే.. వారికి సంఘిభావం తెలియజేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. రాజీనామాలు చేసి ఏమి కోల్పోయామో.. వారికి అప్పుడు అర్థమై ఉంటుంది. కానీ తప్పు చేశామని వారు అంగీకరిస్తే…అంత కంటే… రాజకీయ తప్పిదం ఉండదు కాబట్టి… కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయనే వాదన వినిపించేందుకు కూడా వెనుకాడటం లేదు.
ఓ వైపు ఎంపీలు మాజీలయ్యారు.. రాజ్యసభలో ఉన్న ఇద్దరు ఎంపీలకూ నోరు లేదు. విజయసాయిరెడ్డి ..బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లడలేరు. ఇక వేమిరెడ్డి… నిన్నమొన్న ఎంపీ అయిన వ్యక్తి. ఆయనకు అంత టాకింగ్ పవర్ కూడా లేదు. అంటే.. వైసీపీ తరపున అటు లోక్ సభలో కానీ.. ఇటు రాజ్యసభలో కానీ వాయిస్ వినిపించేవారే లేరు. పార్లమెంట్ బయట వాదన వినిపిద్దామన్నా.. వారికి ఏ వాదన వినిపించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. ఓ సారి బీజేపీతో టీడీపీ కుమ్మక్కయిందంటారు.. మరో సారి కాంగ్రెస్ తో కుమ్మక్కయిందంటారు.. చివరికి తాము ఏం చెబుతున్నారో తమకే అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. రాజకీయ వ్యూహలేమితనంతో.. వైసీపీ.. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఢిల్లీ రాజకీయంలో క్లీన్ బౌల్డ్ అయిపోయింది.