వైసీపీ ఎంపీల రాజీనామాలు ఏ క్షణమైనా ఆమోదం పొందుతాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల రాజీనామాలను.. చాలా పకడ్బందీగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. తమ ఎంపీలను అపర త్యాగయ్యలుగా కీర్తించేందుకు.. సన్నాహాలు చేసేసుకుంది. ఎంపీల రాజీనామాల ఆమోదం పొందిన తర్వాత కొన్ని రోజుల పాటు.. జగన్ పాదయాత్ర కన్నా.. ప్రత్యేకహోదా కోసం… వైసీపీ చేసిన త్యాగమే… సాక్షి మీడియాలో ప్రముఖంగా కనిపించబోతోంది.
ఇంతా చేసీ… ఈ రాజీనామాల వల్ల ఉపయోగం ఏమిటి..? కేంద్రానికి ఏమైనా ఇబ్బందా..? అంటే.. అస్సలు లేదు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ పై ప్రశ్నించేవారు ఓ ఐదుగురు తగ్గుతారు. దీని వల్ల బీజేపీకే లాభం. పోనీ ఉపఎన్నికలు వస్తాయా..? అసలు చాన్స్ లేదు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151-ఏ ప్రకారం.. లోక్‌సభ సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉంటే.. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించదు. ప్రస్తుత పార్లమెంట్ 2014 జూన్ నాలుగో తేదీన సమావేశమయింది. ఈ ఏడాది జూన్ నాలుగో తేదీకి నాలుగేళ్లు పూర్తయిపోయాయి. అంటే ఎంపీల పదవీ కాలం ఇంకా ఏడాది కూడా లేదు. రాజీనామాలు ఆమోదించినా… ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. బీజేపీ కూడా నిర్వహించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే… ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. కర్ణాటకలో యడ్యూరప్ప,శ్రీరాములు రాజీనామా చేసిన స్థానాలకూ జరిపించాల్సి ఉంటుంది. అదో రిస్క్…ఉపఎన్నికలంటే హడలిపోతున్న బీజేపీ ఇప్పుడా రిస్క్ తీసుకునే ప్రశ్నే లేదు.
పోనీ ప్రజలకైనా.. వీరు సిన్సియర్‌గా రాజీనామాలు చేశారని అనిపిస్తుందా అంటే.. అదీ లేదు. ప్రత్యేకహోదా కోసం ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని వైసీపీ 2015 డిసెంబర్ నుంచి నడిపిస్తోంది. డెడ్ లైన్లు మార్చుకుంటూ మార్చుకుంటూ.. ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన రాజీనామాలు చేశారు. నిజానికి వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో సుమిత్రా మహాజన్‌ను వ్యక్తిగతంగా కలిసి… లేఖలు ఇచ్చి రాజీనామాలను ఆమోదించాలని కోరారు. కానీ ఆమె పెండింగ్‌లో పెట్టారు. మధ్యలో హఠాత్తుగా 29వ తేదీన పిలిచి మాట్లాడారు. కానీ మళ్లీ వారం టైం తీసుకున్నారు. ఇదంతా ఉపఎన్నికలు రాకుండా ఆడుతున్న గేమ్ అని మీడియా విశ్లేషించింది. ఉపఎన్నికలు రాకుండా చూస్తామని.. బీజేపీతో ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు.. టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే నిజమవుతోంది.
ఈ మాత్రం రాజీనామాలకే.. వైసీపీ ఎంపీలు.. చాలా పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది ప్రజల్లో వారి పలుకుబడిని తగ్గిస్తుందే తప్ప.. పెంచేది కాదు. అయిననూ.. చేయవలసిందే అన్నట్లు ఉంది వారి పరిస్థితి.