ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలకు ఆమోదముద్ర పడింది. విదేశీ పర్యటన నుంచి మూడు రోజుల కిందట తిరిగి వచ్చిన స్పీకర్ … ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపఎన్నికలు మాత్రం వచ్చే అవకాశం లేదని స్పీకర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ఎంపీలు ఏప్రిల్ ఆరున తమ రాజీనామాలను స్పీకర్‌కు స్పీకర్ ఫార్మాట్లోనే సమర్పించారు. రెండు నెలలు రాజీనామాలను పరిశీలించకుండా స్పీకర్ పక్కన పెట్టారు. మే ఇరవై తొమ్మిదిన, మళ్లీ జూన్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను వ్యక్తిగతంగా కలిశారు.
పార్లమంట్ సమావేశాల చివరి రోజున తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని కోరారు. మొదటి సందర్భంలో.. మరోసారి ఆలోచించుకోవాలని చెప్పిన స్పీకర్.. రెండో సందర్భంలో రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్న రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని సూచించారు. దానికి తగ్గట్లుగా వైసీపీ ఎంపీలు లేఖలు ఇచ్చారు. ఆ లేఖలు ఇచ్చి మూడు రోజులైనా స్పీకర్ రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండానే.. షెడ్యూల్ ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ఆమోద ముద్ర వేశారు. మే 29వ తేదీన రాజీనామాలను ఆమోదిస్తే.. ఉపఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది.ఎందుకంటే 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151-ఏ ప్రకారం.. లోక్‌సభ సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉంటే.. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించదు.
ప్రస్తుత పార్లమెంట్ 2014 జూన్ నాలుగో తేదీన సమావేశమయింది. ఈ ఏడాది జూన్ నాలుగో తేదీకి నాలుగేళ్లు పూర్తయిపోయాయి. అంటే ఎంపీల పదవీ కాలం ఇంకా ఏడాది కూడా లేదు. రాజీనామాలు ఆమోదించినా… ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదని దీనితో తేలిపోయిందని.. రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏడాది పదవీ కాలం మాత్రమే కాదు.. ఎన్నికలు నిర్వహించకుండా ఉండటానిక ఎన్నికల కమిషన్‌కు చాలా మార్గాలున్నాయి. ప్రత్యేకహోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని.. 2015 డిసెంబర్ నుంచి జగన్ చెప్పుకొస్తున్నారు. కానీ డెడ్ లైన్లు మార్చుకుంటూ మార్చుకుంటూ.. ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన రాజీనామాలు చేయించారు. కానీ ఉపఎన్నికలు రాకుండా చూస్తామని.. బీజేపీతో ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు.. టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ క్రెడిట్ గేమ్ కోసం.. అసలు ఆటను వైసీపీ నేతలు ఇప్పుడే ప్రారంభించబోతున్నారు. హోదా కోసం పదవులు త్యాగం చేశామంటూ.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఉపఎన్నికలు రావని చెప్పడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. మరో వైపు.. ముందస్తు ఎన్నికల హడావుడి కూడా ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ లోనే సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని.. డిసెంబర్ కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుందని..ఢిల్లీలో ప్రచారం ప్రారంభమయింది. అంటే.. వైసీపీ ఎంపీల రాజీనామాలు.. త్యాగం చేశామని చెప్పుకోవడానికి తప్ప…దేనికీ ఉపయోగపడవు.