ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపిలు రాజీనామా చేస్తారని వైసీపీ అద్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మలుపుగా మారుతుంది. గతంలో ఈ విషయమై సంకేతాలు మాత్రమే ఇస్తున్న జగన్ ఈసారి సూటిగానే ముందుకొచ్చారు. కర్నూలులో జరిగిన యువభేరి కార్యక్రమం వేదికగా జగన్ చేసిన ఈ ప్రకటన రానున్న కాలంలో ప్రధాన చర్చకు దారితీయొచ్చు. గత శాసనసభలో వైసీపీ ఏర్పాటుతో ఒకవైపు, తెలంగాణ విభజన ఉద్యమం మరోవైపు రాజీనామాలు ఉప ఎన్నికలకు కారణమైనాయి. తదుపరి పరిణామాలు చాలా వరకూ నిర్దేశించాయి.
విభజన సమయంలో నాటి కేంద్రంలోని కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కలసి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని భగం చేయడంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వున్న మాట నిజం.ఈవిషయంలో పరిపరి విధాల మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ఇటీవల ప్రకటించిన అరకొర ప్యాకేజిని స్వాగతించేశారు. దానికి కారకుడంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఆకాశానికెత్తేశారు.దీనిపై నిరసనలు ఉద్యమాలు వచ్చినా పట్టించుకోలేదు. ఇది ముగిసిన అధ్యాయమేనన్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం ఎంపిలతో రాజీనామా చేయిస్తాననడం సంచలనమే.
పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తి పోరాడతామని అక్కడికి స్పందన లేకపోతే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతామని చెప్పడం వ్యూహాత్మకమైన అడుగనే చెప్పాలి. ఎంపిల వరకే రాజీనామా అన్నారు గనక రాష్ట్ర స్థాయి నిర్ణయం మరో దశకు వాయిదా వేయొచ్చు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా రాజీనామాలు చేస్తారా అని సవాలు విసిరారు గనక ఆయనకూ ఇది సమాధానంగా వైసీపీ భావించవచ్చు. తద్వారా ప్రత్యేకహౌదాపై పోరాటంలో చొరవ తమ చేతుల్లోనే వుండేలా జాగ్రత్త పడొచ్చు.