రాజకీయాల్లో అంతే. సొంత పార్టీలో తమపై అనుమానం ప్రారంభమయిందంటే.. ఇక మనుగడ సాగించడం కష్టమే. అందుకే ప్రత్యర్థి రాజకీయ పార్టీలో.. ఇతర పార్టీల్లో చిచ్చు పెట్టడానికి ఇలాంటి అనుమా బీజాలు నాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. రఘురామకృష్ణంరాజు వ్యవహారం తర్వాత వైసీపీలో పది మంది ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం ప్రారంభమయింది. అందులో.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వెంటనే.. ఖండన ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తే కేసులు పెడతానని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసిన వాళ్లను చాలా మందిని చూశామని రాజకీయవర్గాలు ఇంకా చెవులు కొరుక్కుంటున్నాయి.
మరికొంత మంది ఎంపీలు.. ఎమ్మెల్యేల పేర్లు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. పార్క్ హయత్‌లో సుజనా చౌదరిని కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారన్న వార్త బయటకు రావడంతోనే వీరి పేర్లు వైరల్ అవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజీ సేకరించిన వారు…. అందులో వైసీపీ నేతలు ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. ఆ నేతల వివరాలను నిఘా విభాగం ప్రభుత్వంలోని ముఖ్యులకు అందించినట్లు చెబుతున్నారు. కొందరు వైసీపీ నేతలు కలిసిన మాట వాస్తవమేనని సుజనా సన్నిహిత వర్గాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. కలిసిన వైసీపీ నేతల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నమాట నిజమని, వైసీపీలో అంతర్గతంగా పరిస్థితి బాగాలేదని భవిష్యత్ పరిణామాల నేపధ్యంలో కలుస్తున్నారని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీ తీరులో ఇటీవలి కాలంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఢిల్లీలో తమకు అంతు లేని సహకారం ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నా… జరుగుతున్న పరిణామాలు మాత్రం.. దానికి తగ్గట్లుగా లేవు. ఏపీలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ విషయంలో బీజేపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే ఉందంటున్నారు. వైసీపీ పాలనా తీరుతో.. వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని.. ఎప్పుడు ప్రజా వ్యతిరేకత పెరుగుతుందో.. అప్పుడే తమ కార్యాచరణ ప్రారంభించాలనే నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ గతంలో ఓ ప్లాన్ రెడీ చేసుకుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు.. అదే ఆ ప్రజా వ్యతిరేకత తాము ఊహించిన దాని కన్నా ఎక్కువ వచ్చిందన్న ఉద్దేశంతోనే రంగంలోకి దిగినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రాజకీయంగా ఇప్పుడు కొంత మంది ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇరుక్కుపోతున్నారు. నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రకటనలు చేయాల్సి వస్తోంది.