పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీల బీద అరుపులు హోరెత్తిపోతున్నాయి. ప్రతీ రోజూ జీవో అవర్‌లో వారు మాట్లాడటం.. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఆదుకోవాలని కోరడమే జరుగుతోంది. మంగళవారం మిథున్ రెడ్డి చేసిన ప్రసంగంలో ఇక తమ పని అయిపోయింది.. ఏదో ఓ విధంగా కేంద్రమే ఒడ్డున పడేయాలన్న అర్థంతో ప్రసంగించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అంతకు ముందు అనకాపల్లి ఎంపీ కూడా అదే తరహాలో ప్రసగించారు. లోటును కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేయాలని కోరారు. వైసీపీ ఎంపీల ప్రసంగాల తీరు సోషల్ మీడియాలోనూ హైలెట్ అయింది. ఇక ఏపీ దివాలా అంచున ఉన్నదన్న అభిప్రాయానికి వచ్చేలా వారి ప్రసంగాలు ఉన్నాయి.
మరో వైపు టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి ఈ ఆర్థిక దుస్థితికి రావడానికి కారణం జగన్ సర్కార్ ఆర్థికంగా చేసిన అక్రమాలేని అరోపిస్తూ ప్రసంగిస్తున్నారు. పరిమితికి మించి తీసుకున్న రుణాలు .. ఇతర వ్యవహారాల గురించి చర్చిస్తున్నారు. వాటిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీ సర్కార్ సవరించిన ఎఫ్ఆర్బీఎం చట్టం రాజ్యాంగ ఉల్లంఘన అని తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేసి వ్యూహాత్మకంగానే ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి ఏపీ ప్రభుత్వ స్వయంకృతమే కారణం అని.. కేంద్రంతోనే చెప్పిస్తున్నారు. ఏపీ సర్కార్‌పై ఎంత అభిమానం ఉన్నప్పటికీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వీలయినంతగా డౌన్ ప్లే చేసి.. ఏపీ పథకాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆదాయ అంచనాలు సరిగ్గా వేయలేకపోయారని.. చెప్పారు. కానీ ఆమె ఇతర విషయాల జోలికి వెళ్లలేదు. వెళ్తే చాలా విషయాలు చెప్పాల్సి వచ్చేది. చూస్తూంటే పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.