వైసీపీ ఎంపీలందరూ..స్పీకర్ ఓం బిర్లాను కలిసేందుకు వెళ్ళిన సమయంలో… వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు…హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని .. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదని.. అయినా తనపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని రఘురామకృష్ణంరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జూన్ 29న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పిటిషన్‌పై.. ఇంకా సమాధానం రావాల్సి ఉందని ఎంపీ పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనపై చర్య తీసుకోవాలంటే.. క్రమశిక్షణా కమిటీ సమావేశం కావాలన్న నిబంధన పాటించలేదన్నారు. అయితే.. కరోనా కారణంగా.. అత్యవసర పిటిషన్లను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ కారణంగా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అయితే.. రఘురామకృష్ణంరాజు.. చర్య తీసుబోతున్నారంటూ.. హైకోర్టుకు వెళ్లడం.. వైసీపీ వాళ్లను కూడా ఆశ్చర్య పరుస్తోంది. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం అంతిమం. వైసీపీ అయినా.. రఘురామకృష్ణంరాజు అయినా… స్పీకర్ ఓం బిర్లా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే. న్యాస్థానాలు కూడా… జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే రఘు రామకృష్ణంరాజు ఏ వ్యూహంతో… హైకోర్టులో పిటిషన్ వేశారనేది.. వైసీపీ నేతలకు కూడా అంతు చిక్కని అంశంగా మారింది.