రాజ్యసభ సీట్లకు ఎన్నికలు వచ్చేశాయి. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు.. వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. అదీ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ఖాయం. టీడీపీ కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో.. నాలుగు రాజ్యసభ సీట్ల కోసం.. వైసీపీలో రేస్ ప్రారంభమయింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. ఈ రాజ్యసభ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలో ఇప్పటికే ఖరారు చేసుకున్నారని అంటున్నారు. పార్టీ విధేయత… సామాజిక సమీకరణాలు చూసుకుని నలుగురి పేర్లను టిక్ పెట్టుకున్నారని… చివరి క్షణంలో.. ఆయన ఆలోచనల్లో మార్పులు వస్తే తప్ప.. లేకపోతే.. ఆ పేర్లే ఉంటాయంటున్నారు.
రాజ్యసభకు ఖరారైనట్లుగా వైసీపీలో జరుగుతున్నప్రచారంలో మొదటి పేరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి . రాంకీ గ్రూప్ అధినేత అయిన ఈయన.. వైసీపీలో తెరవెనుక చాలా కాలంగా పని చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడు కూడా. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూంటారు. ఈయన 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ కోసం మాత్రం పని చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయనకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని జగన్ ఎప్పుడో నిర్ణయించారు. ఆ ప్రకారం ఇప్పుడు ఆయన పేరు ఖరారయినట్లుగా తెలుస్తోంది. మరో స్థానానికి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరును కూడా దాదాపుగా ఖరారు చేశారు. ఎంపీ టిక్కెట్‌ను త్యాగం చేసినందున రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారు.
రెండు సీట్లు ఖచ్చితంగా రెడ్డి సామాజికవర్గానికి ఇస్తున్నందున.. ఇతర వర్గాలకు.. మిగతా రెండు సీట్లు కేటాయించాల్సి ఉంది. ఇందులో ఒకటి.. బీసీ వర్గాలకు ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేసి.. నెల్లూరు జిల్లా టీడీపీ నేత.. బీద మస్తాన్ రావును.. పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు ఖాయమని అంటున్నారు. ఇప్పుడు వైసీపీకి ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే. మరో సీటు కోసం… పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మధ్య పోటీ ఉంది. వీరిద్దరూ ఎమ్మెల్సీలు. మండలి రద్దు అవుతుందని భావిస్తున్న జగన్.. వీరితో పదవులకు రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారు. ఒకరికి పార్టీ పదవి.. మరొకరికి రాజ్యసభ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మోపిదేవి పేరు రేసులో ముందుంది. ఇప్పటికైతే.. ఇవే పేర్లని.. జగన్ ఆలోచనలు మారితే.. కొత్త వారి పేర్లు బయటకు రావొచ్చని అంటున్నారు. చిరంజీవికి రాజ్యసభ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. అది ఉత్త పుకారేనని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.