ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటర్లందర్నీ దొంగ ఓట్లుగా నిర్ధారించేసి.. ఫామ్-7 దరఖాస్తులు పెట్టేసిన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి ఇప్పుడు… ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై పడింది. ఆయన డీజీపీగా ఉంటే.. తమ ఫామ్-7లు చెల్లవని డిసైడయిపోయారేమో కానీ.. ఆయనపై కూడా ఓ ఫామ్-7 పడేశారని.. ఆయన మీడియా.. ఆయన కొత్త పార్టనర్.. టీఆర్ఎస్ మీడియా.. ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం ఆయనను… తప్పించేస్తారని… ప్రత్యామ్నాయంగా అధికారుల జాబితాలను పంపాలని.. ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే ఈసీ కోరిందని…రాసేస్తున్నాయి. ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ డీజీపీని కొన్నాళ్లుగా… వైసీపీ టార్గెట్ చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల .. ప్రశాసన్ నగర్లో ఇళ్ల అక్రమాలపై వేసిన పిటిషన్‌ను ఆయన ఒక్కరికే అన్వయించేసి..ఆయన ఇంటిని.. కూలగొట్టేశారు. ఏపీలో పని చేస్తున్న మిగతా అధికారులకూ.. హెచ్చరికల్లాంటి సూచనలు పంపారు. ఆ తర్వాత ఆయనపై దుష్ప్రచారం ప్రారంభమయింది. ఆయనను ఏపీ డీజీపీగా తొలగిస్తామని.. టీఆర్ఎస్ కూడా చెబుతోంది. ఎందుకంటే.. డేటా చోరీ విషయంలో.. ఆయన సిట్ వేయకుండా… ఉండాలనే వ్యూహమే. చంద్రబాబు ఆదేశాలను ఆయన ధిక్కరించాలని వారు కోరుకున్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఫామ్-7ల వ్యవహారం నడుస్తోంది. దానిపై.. వందల కొద్దీ క్రిమినల్ కేసులు నమోదుతున్నాయి. దాదాపుగా.. వైసీపీ క్యాడర్ అంతా… కేసుల్లో ఇరుక్కుంటోంది. ఈ క్రమంలో.. వారంతా కేసుల భయంతో.. వణికిపోతున్నారు. ఇప్పుడు వారికి వైసీపీ ధైర్యం ఇవ్వాలనుకుంటోంది. అందుకే.. డీజీపీగా ఠాకూర్‌ను మార్చబోతున్నారని ప్రచారం ఉద్ధృతంగా చేస్తోంది.
నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్ర కనుసన్నల్లో పని చేసినా… దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే.. ఈసీకి డీజీపీని మార్చే అవకాశం ఉంటుంది. కనీసం అప్పటి వరకూ ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేదు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత.. ఆయన విధి నిర్వహణలో ఏమైనా పొరపాటు చేస్తే మాత్రమే… పక్కన పెట్టి.. సీనియార్టీలో తర్వాతి స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇస్తారు. కానీ ఠాకూర్‌పై.. ప్రతిపక్ష పార్టీగా.. వైసీపీ చేసే ఆరోపణలు తప్ప.. ఆయన విధి నిర్వహణపై ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన నిజాయితీని శంకించేవాళ్లు.. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.