వైసీపీలో చేరితే.. ఎలాంటి కేసులు లేకుండా చేస్తామనే బెదిరింపులతో కూడిన ఆఫర్లు వస్తున్నాయని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఓడిపోయినప్పటి నుండి.. ఆ పార్టీకి కాస్త దూరం పాటిస్తూ… జగన్పై అప్పుడప్పుడూ పొగడ్తల వర్షం కురిపిస్తూ.. రాజకీయంగా.. సంధి కాలంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న జేసీ.. ఒక్క సారిగా.. రూటు మార్చారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోందన్నారు. హద్దు మీరి పాలన సాగుతోందని… వైసీపీలో చేరితే.. కేసులుండవని కబురు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి ఇలా.. ఒక్క సారిగా.. బ్లాస్ట్ అవడానికి కారణం.. ఆయనపై .. ఆయన కుటుంబానికి చెందిన వ్యాపారాలపై వరుసగా కేసులు నమోదు చేయడమే. జేసీ కుటుంబానికి 70ఏళ్లుగా ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. అందులో బస్సులు ఎక్కువే. దివాకర్ ట్రావెల్స్ పేరు వినని వారు ఉండరు. అయితే.. ఇటీవలి కాలంలో ఆ బస్సుల రాకపోకలు పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం… ఆ సంస్థకు ఉన్న బస్సుల్లో 70 శాతం బస్సులను.. ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇతర ట్రావెల్స్ జోలికి పోని అధికారులు ఎవరో కావాలని చెప్పినట్లుగా.. జేసీ బ్రదర్స్ బస్సులను మాత్రమే సీజ్ చేశారు. వారు న్యాయపోరాటం చేసి.. ట్రిబ్యునల్ వద్దకు వెళ్లి.. ఆర్డర్స్ తెచ్చుకున్నా… అధికారులు వదిలి పెట్టడం లేదు. ఈ కారణంగానే.. జేసీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
అధికారులు.. ప్రభుత్వానికి భయపడి తప్పుడు పనులు చేస్తున్నారని… అలా చేయకపోతే.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినట్లుగా బదిలీ చేస్తారని.. ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న ఉద్దేశంతోనే.. జేసీ బ్రదర్స్ … కాస్త సంయమనం పాటిస్తున్నారు. రాజకీయంగా.. అంత యాక్టివ్ గా ఉండటం లేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఆయనను వదిలి పెట్టాలనుకోవడం లేదని… వారిపై.. పెరుగుతున్న ఒత్తిడి… వరుసగా నమోదవుతున్న కేసులతోనే స్పష్టమవుతోంది. దీంతో జేసీ.. తనదైన శైలిని మళ్లీ బయటకు తీశారు.