నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలకు తెర లేచిందని చెప్పారు. వైకాపా తరఫున గెలిచి, తరువాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి తనకు టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని ఆ వర్గం బాగానే ఆశలు పెట్టుకుంది. అయితే, ఇప్పుడు పరిస్థితి వేరేలా మారుతోంది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి భూమా కుటుంబానికే అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి, భూమా మరణించాక, ఆయన కుమార్తెకు టీడీపీ సర్కారు మంత్రి పదవి కట్టబెట్టింది. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలో కూడా ఆ కుటుంబానికే మరో అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు చాలారోజులుగా వినిపిస్తున్నదే.
దీంతో టీడీపీ నుంచి టిక్కెట్టు ఆశించిన మోహన్ రెడ్డికి కాస్త నిరాశే ఎదురైంది. అయితే, ఈ అవకాశాన్ని వైకాపా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు కథనాలు వచ్చారు. వైకాపా తరఫున శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఆఫర్ చేసినట్టు.. కొద్ది రోజుల్లో శిల్పా సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకుంటారన్నట్టుగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిల్పా సోదరులతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి ద్వారా శిల్పా మోహన్ రెడ్డికి చంద్రబాబు కబురు పంపారట. అలా వీరి భేటీ జరిగింది. అయితే, ఇందులో ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది మాత్రం బయటకి తెలీదు.
నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగూ భూమా ఫ్యామిలీకే టీడీపీ టిక్కెట్ ఇస్తుంది కాబట్టి, తనను వైకాపా నుంచి పోటీకి దిగాల్సిందిగా కార్యకర్తలూ మద్దతుదారులూ ఒత్తిడి తెస్తున్నారంటూ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం. మరి, ఇలాంటి పరిస్థితుల మధ్య జరిగిన భేటీ ఎలా ఫలిస్తుందనేది వేచి చూడాలి. టీడీపీతో కాస్త సర్దుబాటు చేసుకుని, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ భూమా సోదరులు సైలెంట్ గా ఉంటారా..? లేదంటే, వైకాపాలో చేరి పోటీకి దిగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైకాపా వర్గాలు కూడా శిల్పా మోహన్ కి టిక్కెట్ ఇచ్చి, నంద్యాల బరిలోకి దింపాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం శిల్పా సోదరుల ప్రస్థానం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.