జనసేన ఫిరాయింపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు తత్వం బోధపడుతోంది. ఆయనను సీఎంవో కు పిలిపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కూడా నేరుగా మాట్లాడకుండా ఐ ప్యాక్ తో మాట్లాడించారు. సర్వేలు బాగో లేనందున.. సీటివ్వలేకపోతున్నామని.. చెప్పేశారని అంటున్నారు. అయితే అమలాపురం ఎంపీ సీటు నుంచి నిలబడాలని సూచించారు. ఏదో ఓ సీటు వస్తుందని ఆశ పెట్టడానికే ఈ వ్యవహారం అని .. వైసీపీ రాజకీయాలు చూస్తున్న అందరికీ తెలుసు. ఎందుకంటే.. గోదావరి జిల్లాల్లో దళిత నేతలకు ఎవరికి టిక్కెట్ ఎగ్గొడుతున్నా వారికి అమలాపురం సీటు ఆఫర్ చేస్తున్నారు.
ఇప్పటికే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పేరు పరిశీలనలో ఉంది. రాజోలు టిక్కెట్ ఆఫర్ చేసి.. గొల్లపల్లి సూర్యారావును వైసీపీలో చేర్చుకున్నారు. ఆయన నియోజకవర్గానికి వెళ్లి తానే అభ్యర్థినని రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు రాపాకకు అసలు విషయం బోధపడుతోంది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజోలు నుంచి పోటీ చేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. కానీ వైసీపీలో అలాంటివేమీ ఉండవు. పైగా రాపాక… వైసీపీలో గెలిచిన నేత కాదు. జనసేనను మోసం చేసి వచ్చారు. ఆయనకు మరో ఆప్షన్ లేదు. అందుకే పక్కన పెట్టినా కామ్ గా ఉంటారని వైసీపీ నేతలకు అర్థమైపోయింది.
రాపాకను గతంలో జగన్ మోసం చేస్తే పవన్ రాజోలు టిక్కెట్ ఇచ్చారు. 2019కి ముందు రాపాక వైసీపీలో పని చేసుకున్నారు. జగన్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో పవన్ వద్దకు వచ్చారు. ఆయన జాలిపడి టిక్కెట్ ఇచ్చారు. ఓడిపోయాక.. పవన్ ను మోసం చేసి జగన్ పంచన చేరారు. ఇప్పుడు జగన్ చేతిలో మళ్లీ మోసపోతున్నారు. ఇప్పుడు పవనే కాదు.. ఇంకెవరైనా రాపాకను నమ్ముతారా ?