వైసీపీ అభ్యర్థుల పరంగా దివాలా తీసింది. టిక్కెట్ల లభించని టీడీపీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. టిక్కెట్లు ఇస్తామని వైసీపీలోకి రావాలని పిలుపులు ఇస్తున్నారు దీంతో కొంత మంది ఆ పార్టీలో చేరిపోయేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇలా పిలిచిన వారిలో పార్టీలో చేర్చుకుని చాలా మందికి హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావును తాడేపల్లికి పిలిపించుకున్నారు. ఆయన మా దగ్గరకు వచ్చారని మీడియాకు లీక్ చేశారు. దీంతో టీడీపీ ఆయన స్థానంలో టీడీపీ పార్థసారధిని ఇంచార్జ్ గా నియమించింది. ఇప్పుడు వైసీపీ పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన రెంటికి చెడ్డ రేవడి అయ్యారు.
తాజాగా అవనిగడ్డ నుంచి మండలి బుద్దప్రసాద్ ను వైసీపీ ఆహ్వానించింది. అవనిగడ్డ జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నేతల సమావేశం పెట్టి… వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని.. పార్టీ మారిపోదామని.. టిక్కెట్ ఇస్తారని చెప్పుకున్నారు. కొంత మంది వెళదామని అంటే.. కొంత మంది ఏ విషయం చెప్పలేదు. ఆయన ఈ రోజో.. రేపో నిర్ణయం తీసుకుని వైసీపీలో చేరిపోయే అవకాశం ఉంది. అవనిగడ్డలో వైసీపీకి క్యాండిడేట్ లేరు. సింహాద్రి చంద్రశేఖర్ అనే డాక్టర్ కు ప్రకటించినా ఆయన నియోజకవర్గం వైపు చూడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను. మచిలీపట్నం ఇంచార్జ్ గా నియమించారు
మరో వైపు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. ఆయన రాజోలు నుంచి గతంలో గెలిచారు. కానీ ఇప్పుడా స్థానం జనసేన ఖాతాలో పడింది. ఆయన తన కుమార్తెకు సీటివ్వాలని కోరారు. కానీ పవన్ అంగీకరించలేదు. వైసీపీ ఆయనను సంప్రదించింది. అమలాపురం ఎంపీ సీటులో నిలబెట్టేందుకు పరిశీలిస్తామని.. పార్టీలో చేరాలని కోరారు. దానికి ఆయన అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే కనీసం.. పది నుంచి పదిహేను మంది టీడీపీలో దక్కని వాళ్లకు టిక్కెట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కొంత మంది జనసేన నేతలకూ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసే వారికి ఆర్థిక సాయం చేస్తామన్న ఆఫర్లు కూడా ఇస్తున్నారు.