వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎట్టకేలకు.. అమరావతికి మారుతున్నారు. ఈ నెల ఇరవై మూడో తేదీన కౌంటింగ్ డే రోజు నుంచి ఆయన అమరావతిలో మకాం వేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే… ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉండవల్లి గ్రామంలో.. అత్యంత విశాలంగా ఇంటితో పాటు… పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. మౌలిక వసతులు ఇప్పుడిప్పుడే కల్పిస్తున్నారు. ఇల్లు, పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఫర్నీచర్, ఇతర సామాగ్రి తరలింపు ప్రారంభమయింది.
ఓట్ల లెక్కింపు రోజు నుంచి ఉండవల్లిలో జగన్ నివాసం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత ఐదేళ్లుగా… హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. టీడీపీ తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ ఆయన లైట్ తీసుకున్నారు. హైదరాబాద్‌ను వదిలి పెట్టి రాలేదు. జనసేన పార్టీ కూడా… అమరావతి కేంద్రంగా రాజకీయాలు చేసింది. ఎన్నికల వ్యూహాలకు అక్కడ్నుంచే పదును పెట్టుకుంది. అభ్యర్థుల ఖరారు కూడా అక్కడే చేశారు. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం… ఎన్నికల ప్రచారానికి కూడా రోజూ.. హైదరాబాద్ నుంచి ఏపీలోని నియోజకవర్గాలకు వెళ్లేవారు. దీనిపై విమర్శలు వచ్చినా… ఆయన ఖాతరు చేయలేదు. చివరికి… పోలింగ్ ముగిసిన తర్వాత నెలన్నర రోజుల పాటు కూడా లోటస్‌పాండ్‌లోనే ఉన్నారు. కచ్చితంగా కౌంటింగ్ రోజు నుంచి మాత్రం ఇక ఏపీ నుంచే… కార్యకలాపాలు అనే లీక్ ఇచ్చారు.
ఎన్ని విమర్శలొచ్చినా హైదరాబాద్ వదిలి రాని జగన్..!
జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ఫలితాలను.. ఉండవల్లిలోని నివాసంలోనే వీక్షించబోతున్నారు. ముందుగా… ఆయన ఇరవై ఒకటో తేదీన అభ్యర్థులతో సమావేశమవుతారు. గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం అయితే… హైదరాబాద్ వెళ్లి లోటస్ పాండ్‌లోనే ఫలితాలు చూడాలి. కానీ… మనసు మార్చుకున్నారు. ఉండవల్లి నివాసంలోనే… ఎన్నికల ఫలితాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే.. ప్రతీ విషయాన్ని పక్క రాష్ట్రం నుంచే పరిశీలిస్తున్నారని.. ఆయనకు ఏపీని పాలించే హక్కు ఎలా ఉందని.. ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కార్యాలయం మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫలితం తేడా వస్తే ఉండవల్లిలోనే ఉంటారా..?
అయితే వైసీపీ వర్గాల్లో మాత్రం… భిన్నమైన ప్రచారం జరుగుతోంది. సానుకూల ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. సానుకూల ఫలితం వస్తే.. ఎలాగూ ఉండవల్లి నుంచే… ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించాల్సి ఉంటుంది. రోజూ హైదరాబాద్ వెళ్లి రావడం సాధ్యం కాదు. అందుకే.. గెలుపుపై నమ్మకంతోనే… ఆయన ఉండవల్లికి మారుతున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఫలితంలో తేడా వస్తే.. తన రాజకీయాలు.. మరోసారి ప్రతిపక్ష నేతగా… కార్యకలాపాలు ఉండవల్లి నుంచే చేస్తారా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. వైసీపీకి ఎన్నికల్లో సానుకూల ఫలితం రాకపోతే.. మళ్లీ హైదరాబాద్ నుంచే.. జగన్ వ్యవహారాలు చక్కబెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.