వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఏ ఒక్క జిల్లాలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల్లేవు. కనీసం కుర్చీల్లేవు. ఆఫీసుల్ని అద్దె భవనాల్లో గోడౌన్లు వంటి చోట్ల సర్దుబాటు చేశారు. ఇప్పటికీ వాటికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయలేదు. శాశ్వత భవానాల కోసం భూమి కేటాయించలేదు. నిర్మాణాలకు డబ్బులు కేటాయించలేదు. కానీ వైసీపీ కార్యాలయాలకు మాత్రం ఉన్న పళంగా భూములు కేటాయించేసుకుని.. నిర్మాణాలు కూడా చేసుకుంటున్నారు.
కొత్త జిల్లాల్లో వైసీపీ ఆఫీసులకు ప్రభుత్వం అత్యంత విలువైన భూములు కేటాయించుకుంది. ఎకరానికి రూ. వెయ్యి.. రెండు వేల లీజుకు తీసుకుంది. అంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. మొత్తంగా రూ. వంద కోట్ల విలువైన స్థలాలను వైసీపీ పరం చేశారు. ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉంటే ముందుగా.. తాము ఏర్పాటు చేసిన జిల్లాలకు గవర్నమెంటాఫీసుల్ని నిర్మించాల్సి ఉంది. పైసా ఖర్చు లేకుండా పేపర్ల మీద జిల్లాల్ని విభజించి రాజకీయ అవసరాల కోసం పేర్లు పెట్టేసి వదిలేశారు. కానీ పార్టీ కోసం మాత్రం విలువైన స్థలాల్ని రాయించేసుకుంటున్నారు.
ఏపీలో ప్రజలు పన్నులుగా కట్టే ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు మొత్తం సీఎం జగన్.. ఆయన పార్టీ వైసీపీ.. సొంత ఆస్తులు మాదిరిగా వాడేసుకుంటున్నారు. ఇష్టం వచ్చిటన్లుగా అమ్మేస్తున్నారు. తాకట్టు పెడుతున్నారు. జగన్ వ్యాపార సంస్థలకు కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. భూముల్ని వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకుంటున్నారు. ఎక్కడా అధికారులు.. వ్యవస్థ.. నిబంధనలకు విరుద్ధం అనే మాటే చెప్పడం లేదు. ఇష్టారాజ్యంగా పాలన చేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని.. ఆస్తులను దుర్వినియోగం చేస్తూంటారు.