వైసీపీ ఆఫీసుల్ని కూల్చకుండా వైసీపీ కోర్టుకెళ్లింది. కానీ ఏ కోర్టు అయినా అక్రమ నిర్మాణాల్ని కూల్చొద్దని చెప్పదనే లాజిక్‌ను మర్చిపోయింది. అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భవనాలపై కోర్టులో గతంలో చాలా సీరియస్ గా స్పందించాయి. ఢిల్లీలో సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించిన అత్యంత ఎత్తయిన అపార్టుమెంట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగ కూల్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ కోర్టు అయినా అదే చెబుతుంది. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించవద్దనే చెబుతుంది.
వైసీపీ కార్యాలయాలు అన్నీ అక్రమ నిర్మాణాలే. అదీ కూడా ప్రజా ఆస్తుల్ని లీజుకు తీసుకుని అందులో కట్టారు. అంటే అన్ని విధాలుగా నిబంధనలను ఉల్లంఘించారు. ఇప్పుడు ఆ విషయం కోర్టులో చెప్పకుండా స్థలం చట్టబద్ధంగా లీజుకు తీసుకున్నామని.. అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నామని వాదిస్తున్నారు. నిజానికి చాలా చోట్ల దరఖాస్తులుకూడా చేయలేదు. అందుకే వారం రోజుల గడువు ఇచ్చారు. మామూలుగా కోర్టుకు వెళ్లకుండా అధికారులతో సంప్రదింపులు జరిపి … ఆ నిర్మాణాలకు పరిష్కారం ఏమిటో కనుక్కుని ఆ ప్రకారం ముందుకు వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉండేదేమో.
అవన్నీ ప్రభుత్వ స్థలాలు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడాలేదు కాబట్టి ఆ స్థలాల ఒప్పందాలనురద్దు చేసి.. ఆ భవనాలను సీజ్ చేసి ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకుంటే బాగుంటుదన్న వాదన ఉంది. కూల్చివేతలు జరగకుండా వైసీపీనే ప్రత్యామ్నాయం ఆలోచించాల్సింది పోయి.. కోర్టుకెళ్లారు. కోర్టులో వాదనలు ఆలస్యం చేసి.. సగం సగం నిజాలు చెప్పి… కొన్నాళ్లు కూల్చివేయకుండా కాపాడుకోగలరు కానీ…ఎంతో కాలం కాపాడుకోలేరు. ఎందుకు ప్రభుత్వం ఎప్పుడు కూల్చాలంటే అప్పుడు కూల్చేయగలదు. దానికి జగన్ రెడ్డి పాలనలో కూల్చిన ఎన్నో టీడీపీ నేతల భవనాలే సాక్ష్యం..
సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అక్రమ కట్టడాలపై జగన్ రెడ్డి చెప్పిన ప్రవచనం ఆ కూల్చివేతల దగ్గర పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ప్లే చేస్తే… వైసీపీ నేతలకూ స్పష్టత వస్తుంది.