ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి సెగ తగులుతుందేమో కానీ.. కాస్త రిలీఫ్ కోసం.. ఏదో ఒకటి చేయాలనుకుని మళ్లీ అమరావతి భూముల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. మాజీ సీఆర్డీఏ కమిషనర్ స్టేట్మెంట్ సీఐడీకి కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారంటూ.. వైసీపీకి సన్నిహిత మీడియా చానళ్లలో ప్రచారం ప్రారంభించారు. ఆ చానళ్లలో చెప్పిన దాని ప్రకారం.. సీఆర్డీఏ ఏర్పడక ముందు అంటే రాజధానిగా నిర్ణయం జరగక ముందే.. రికార్డులన్నీ మంత్రి నారాయణ తెప్పించుకున్నారట. ఆ తర్వాత రికార్డులు మిస్సయ్యాయట. మొత్తంగా మంత్రి నారాయణతో ఫలానా వారు.. ఫలానా వారు తిరుగుతారని చెప్పుకొచ్చారట. అంతకు మించి టీవీ చానళ్లలో కూడా పెద్దగా వివరాలు రాలేదు. కానీ ఆ చానళ్లు మాత్రం.. శ్రీధర్ సీఎస్‌కు లేఖ రాశారని.. కీలకమైన విషయాలు చెప్పాను కాబట్టి తనకు భద్రత పెంచాలని కోరారని చెప్పుకొచ్చారు.
కొనసాగింపుగా మాజీ మంత్రి నారాయణ అడ్రస్ లేరని కూడా బ్రేకింగ్‌లు వేశారు. అసలు సీఆర్డీఏ కమిషర్‌గా చెరుకూరి శ్రీధర్ మధ్యలో వచ్చారు. సీఆర్డీఏ ఏర్పడక ముందు రికార్డుల గురించి ఆయన చెబితే.. సీఐడీ స్టేట్ మెంట్ రికార్డు చేయడం ఏమిటో కానీ.. మళ్లీ ఏదో చేస్తున్నామన్న హడావుడి మాత్రం ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్ మీడియాకు లీక్ అయిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఓ వీడియో విడుదల చేశారు. మామూలుగా ఆయన వచ్చి ప్రెస్‌మీట్ పెడతారు. అంత అవసరం లేదనుకున్నారేమో కానీ .. ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాజీ కలెక్టర్ సాంబశివరావు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్‌లుగా కీలక పాత్ర పోషిస్తున్న కోన శశిధర్, కాంతిలాల్ దండే వంటి వారిని హెచ్చరిస్తున్నట్లుగా వీడియో ఉంది. రెండేళ్లుగా అమరావతిలో భూముల అక్రమాలని.. దళితుల భూములని.. అన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఎన్నో విచారణలు వేసినా ప్రభుత్వం ఏ అవినీతిని నిరూపించలేకపోయింది.
అన్నీ కోర్టుల్లో తేలిపోతూండటంతో .. ఇప్పుడు చెరుకూరి శ్రీధర్ స్టేట్ మెంట్ అంటూ కొత్త గేమ్ ప్రారంభించినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం… రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు తిరుగుబాటు స్థితికి వచ్చాయని… దృష్టి మళ్లించేందుకు మళ్లీ అమరావతి అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. కొసమెరుపేమిటంటే.. ఈ స్టేట్మెంట్ను కోర్టులో ప్రవేశ పెట్టి.. మంత్రి నారాయణను విచారించడానికి సీఐడీ పర్మిషన్ తీసుకుంటుందట. ఎందుకంటే.. ఈ విచారణపై ఇప్పటికే స్టే ఉంది. దానిపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. అక్కడి పిటిషన్ పరిష్కారం కాకుండా ఇక్కడ హైకోర్టు రూలింగ్ ఇవ్వడం సహజంగా జరగదు. మరి ఆదివారం పూట ప్రభుత్వ వ్యూహకర్తలు ఎందుకు గేమ్ ప్రారంభించారో తెలియాల్సి ఉంది.