టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధపడింది. దీంతో వైకాపాలో ఒక్కసారిగా కలవరం పుట్టుకొచ్చింది..! కంగారు కనిపిస్తోంది. క్రెడిట్ కోసం పాకులాట మొదలుపెట్టేసింది. రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలు పార్లమెంటు ఎదుట ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై నాలుగు సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసింది తామే అంటూ మరోసారి పార్లమెంటు బయట మీడియాతో చెప్పారు. అంతేకాదు, తాజా తీర్మానం కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో… ఇది టీడీపీ, భాజపా కుట్ర అంటూ కొత్త ప్రచారం అందుకున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కేవలం ఓట్ల కోసమే టీడీపీ, భాజపాల నాటకాలు ఆడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది టీడీపీ, భాజపా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నిమిత్తం గత సమావేశాల్లో తాము 13 సార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చామనీ, కానీ చర్చకు అనుమతించలేదన్నారు. తాము ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన తరువాత టీడీపీ పెట్టిన తీర్మానం అనుమతించడం వెనక ఉన్న మతలబు ఏంటని వైవీ ప్రశ్నించారు..? గతంలో తమకు 50 మంది సభ్యుల మద్దతు ఉందనీ, అయినాసరే తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎందుకు స్వీకరించలేదంటూ నిలదీశారు. భాజపా, తెలుగుదేశం పార్టీలు లోపయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయనీ, నాలుగేళ్లపాటు ఎందుకు హోదా ఇవ్వలేదన్నది ప్రజలకు ఈ రెండు పార్టీలూ వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేశామనీ, ఆమరణ నిరాహార దీక్షలు చేశామనీ, పదవులను తృణప్రాయంగా వదులుకున్నామనీ, కేవలం తమ పోరాటాలు వల్లనే ఏపీ ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయం అయిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వైకాపా మాజీ ఎంపీలు..! చివరి అస్త్రంగా రాజీనామా చేసేశారు. కానీ, ఇప్పుడు పార్లమెంటులోకి వెళ్లేందుకు అనుమతి లేకపోయినా… అక్కడ పోరాటం అంటున్నారు. అంటే.. చట్టసభల్లో పోరాటం చేయాలంటే ప్రజాప్రతినిధులుగా కొనసాగాలన్నది వారికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ప్రస్తుత సమావేశాల్లో టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై కేంద్రం చర్చకు సిద్ధమనేసరికి… భాజపా, టీడీపీలను ఒకే గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రపక్షమైన భాజపా మీదే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని వైవీ అంటున్నారు. టీడీపీ, భాజపాల మైత్రి గత పార్లమెంటు సమావేశంలోనే అధికారికంగానే తెగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు కూడా వైకాపా రాజకీయం కోసం చూస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..? రాజీనామాలు చేసి, ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామన్నారు. మరి, ఇవాళ్ల పార్లమెంటు ప్రాంగణానికి వైకాపా మాజీ ఎంపీలు వెళ్లాల్సిన పనేముంది..? నాలుగేళ్లుగా పోరాటం చేశాం, పదవులకు త్యాగాలు చేశామని చెప్తున్నారే తప్ప.. వాటి వల్ల కేంద్రం తీరులో కొంచెమైనా స్పందన వచ్చిందా అనేది వైకాపా మాజీ ఎంపీలు సమాధానం చెప్పలేని ప్రశ్న అనడంలో సందేహం లేదు.