” పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు..” ఈ మాటను ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ.. పంచాయతీ ఎన్నికల విషయంలో అదే పనిగా ప్రచారం చేస్తోంది. సీఎం ఎలాగూ మీడియా ముందుకు రారు.. ఆయనకు బదులుగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అదే చెబుతున్నారు. ఏం చెప్పినా… ముందుగా పార్టీ రహిత ఎన్నికలని అంటున్నారు. పెద్దిరెడ్డి, బొత్స కూడా అదే చెబుతున్నారు. ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చిన ప్రకటనల్లోనూ.. పార్టీ రహిత ఎన్నికలంటూ.. వైసీపీ రంగుల్లో ప్రకటనలు ఇచ్చారు. వైసీపీ ఎందుకు ఇంతగా కంగారు పడుతోందన్నది… చాలా మందికి అర్థం కాకుండా పోతోంది.
పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగానే జరుగుతాయి. అంటే..నామినేషన్లు వేసేటప్పుడు కానీ. .. మరో విధమైన ఎన్నికల ప్రక్రియలో కానీ.. పార్టీల గుర్తులు వాడరు. పార్టీల ప్రస్తావన ఉండదు. వ్యక్తుల ప్రాతిపదికనే జరుగుతుంది. అయితే ఇదంతా అధికారికంగా కానీ ఏ గ్రామంలో .. ప్రధాన పార్టీల మద్దతుదారులే.. పోటీ పడుతూంటారు. వారి కోసం వారి పార్టీ నేతలే ప్రచారం చేసుకుంటారు. గుర్తు పరంగా మాత్రమే పార్టీలు ఉండవు. కానీ పోటీ మాత్రం రాజకీయ పార్టీల మధ్యనే సాగుతూంటుంది. ఈ విషయం తెలియక కాదు.. తెలిసినా మభ్య పెట్టాలన్నట్లుగా వైసీపీ తీరు ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏకగ్రీవం చేసుకోకపోతే.. కొత్త చట్టం ప్రకారం అనర్హతా వేటు వేస్తామని హెచ్చరికలు… అలాగే ఏకగ్రీవం చేసుకుంటే.. పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామంటూ ప్రచారం… పార్టీ రహితం అంటూ చేస్తున్న హడావుడి.. వైసీపీ కంగారును ప్రజల ముందు పెడుతున్నాయి. ఎవరైనా ప్రజలు ఓట్లేస్తే.. భారీ మెజార్టీతో గెలిచి.. తమ సత్తా చూపించాలని అనుకుంటారు. కానీ అనూహ్యంగా ఏపీ అధికార పార్టీ అసలు ఓట్లు వేసే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా గెలిచేయాలనుకుంటోంది. అక్కడే సాధారణ ప్రజల్లోనూ అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ప్రజలు ఓట్లు వేస్తే.. ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఆలోచించుకోవాల్సింది ఏపీ అధికార పార్టీనే.