ఓట్లు ఎవరు పడితే వారు తొలగించవచ్చా..? చేతిలో ట్యాబ్ ఉంటే దానితో ఓట్లు తీసేయోచ్చా..?. కనీసం. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవడానికే… ఈసీ వెబ్ సైట్ నానా తంటాలు పెడుతుంది. అలాంటిది.. వైసీపీ సానుభూతి పరులెవరోతెలుసుని వారి ఓట్లను తొలగించడానికి ఓ ప్రత్యేక సర్వే జరుగుతోందంటూ.. వైసీపీ హడావుడి పడిపోతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో .. సర్వేలు చేస్తున్న ఓ సంస్థ సిబ్బందిని వైసీపీ నేతలు అడ్డుకుని వారి దగ్గర ట్యాబుల్ని లాక్కుని పంపించేశారు. ఆ ట్యాబ్ లను తీసుకొచ్చి.. ఈసీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు.. వైసీపీ బొత్స సత్యనారాయణ.
సర్వేలు చేస్తూ.. వైసీపీ సానుభూతి పరులమని చెప్పగానే ఓట్లు తీసేస్తున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదును చూసి.. కొత్తగా ఏపీ ఎన్నికల అధికారిగా నియమితులైన గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అలా ఎవరు పడితే వారు ఓటర్ల జాబితాను సవరించే అవకాశం ఉండదన్నారు. మరో వైపు.. ట్యాబులు తీసుకున్నారంటూ… ఆ సర్వే సంస్థ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో .. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై.. వైసీపీ నేతలు ఆందోళన చేశారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. మీడియా సంస్థలు చేయించుకుంటున్నాయి. వీటిలో కొన్ని సొంతంగా.. ఆఫీసు గదిలో కూర్చుని సర్వేలు చేసుకుంటాయి కానీ.. కొన్ని సంస్థలు మాత్రం.. ప్రజాభిప్రాయాన్ని పక్కాగా పట్టుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో.. ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ సర్వేలు టీడీపీ కోసమేనంటూ.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజులుగా.. వైసీపీ నేతలు.. నకిలీ ఓట్లు ఉన్నాయని… ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. గతంలో ఎన్నికల అధికారిగా సిసోడియా ఉన్నప్పుడూ అవే ఆరోపణలు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. గోపాల కృష్ణ ద్వివేదీ వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారని కొత్త ఆరోపణలు ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఓట్ల అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు సేకరించి.. కోర్టుకువెళ్లారు. కానీ ఏపీలో వైసీపీ నేతలు మాత్రం.. ఆరోపణలకే పరిమితమవుతున్నారు కానీ… తమ దగ్గర ఉన్న ఆధారాలతో.. కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. దాంతో అవి రాజకీయ ఆరోపణలు గానే ఉన్నాయి.