కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక విషయమై అభ్యర్థుల ఖరారీ కసరత్తులో టీడీపీ తలమునకలై ఉంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. గెలిచేందుకు కావాల్సిన సంఖ్యాబలం పుష్కలంగా ఉందని ధీమాతో ఉన్నారు. అయితే, ఈ తరుణంలో అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న పరిణామం ఏంటంటే… ఎమ్మెల్సీ ఎన్నిక పోటీ నుంచి ప్రధాన ప్రతిపక్షం వైకాపా వైదొలిగినట్టు ప్రకటించడం! ఇదే విషయాన్ని వైకాపా నాయకుడు బీవై రామయ్య చెప్పారు. ఇంతకీ వైకాపా పోటీకి ఎందుకు దిగడం లేదో కూడా తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికను అపహాస్యం పాలు చేస్తున్నారనీ, కర్నూలు జిల్లాలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో మరోసారి అలాంటి అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదనే పోటీ చేయదల్చుకోలేదన్నారు. విలువలతో కూడిన రాజకీయం కోసం గతంలో ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశామనీ, ఇప్పుడు కూడా అవే విలువలకు కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు వెళ్లొద్దు.. అనే నిర్ణయానికి రెండు పార్శ్వాలున్నాయి. మొదటిది.. దీని ద్వారా వైకాపా ఆశిస్తున్నది ఏంటంటే… సామాన్యుల్లో చర్చ జరగాలని! తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఫిరాయింపులపై మరింత తీవ్రమైన పోరాటం చేసేందుకు ఈ నిర్ణయాన్ని వాడుకోవచ్చని. ఎమ్మెల్సీ పదవినే వదులుకుంటున్నారంటే… అక్కడ టీడీపీ ఏ స్థాయిలో డబ్బును వాడుతోందో అనే అనుమానం ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలని..! అయితే, నిజానికి ఇదేమంత కొత్త విషయం కాదు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల సమయంలో కూడా ఇలానే చెప్పారు. కోట్లకు కోట్లూ ఖర్చు పెట్టారు కాబట్టే గెలిచారని ఆరోపించారు. ఇప్పుడూ అదే అస్త్రంతో విమర్శలు చేస్తారు. దీని వల్ల కొత్తగా వైకాపాకు వచ్చే మైలేజ్ ఏమాత్రం ఉంటుందనేదే ప్రశ్న..?
ఇక, రెండో పార్శ్వం… వైకాపా శ్రేణులపై ఇలాంటి నిర్ణయం చూపే ప్రభావం! పోరాడి ఓడిపోవాలని అంటారుగానీ.. ఓడిపోతామని పోరాటాన్ని ఆపేయడం కరెక్ట్ కాదు కదా! కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ డబ్బుతో దిగుతుందన్న పక్కా సమాచారం ఉన్నప్పుడు, వైకాపా కూడా అభ్యర్థిని పెట్టాలి. ఆ డబ్బేదో బయటకి తీయించాలి! ఆ రాజకీయాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేయాలి. ప్రజలకు వాస్తవాలను చూపించాలి. ఆ స్థాయిలో పోరాటం చేసి ఓడినా.. వైకాపాకు దక్కాల్సిన సింపథీ దక్కుతుంది. ఆ ఓటమి ద్వారా శ్రేణుల్లో మరింత కసి పెంచే స్ఫూర్తిని నింపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇక్కడ మరో సంకేతం కూడా క్యాడర్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్సీ ఎన్నికకే డబ్బు ఖర్చు పెట్టేందుకు పార్టీ నాయకత్వం వెనకాడితే… రేప్పొద్దు అసెంబ్లీ ఎన్నికల సంగతేంటనే ప్రశ్న పార్టీ వర్గాల్లో చర్చనీయం అవుతుంది కదా!
మొన్నటికి మొన్న.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఎందుకయ్యా అంటే… ఫిరాయింపు రాజకీయాలపై పోరాటమన్నారు! ఆ పోరాటానికీ రూపూరేఖా ఏంటో చెప్పలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, కాపుల రిజర్వేషన్లు వంటి ఎన్నో కీలకాంశాలపై చర్చించే అవకాశాన్ని వదిలేశారు. ఇప్పుడు ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాడాల్సిన చట్టసభలకు హాజరు కారు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా బహిష్కరిస్తారు. మరి, విలువలతో కూడిన రాజకీయం అంటే ఏంటో, రాజకీయాల్లో వారు కోరుకుంటున్న సమూల మార్పును ఏ మార్గాల ద్వారా తెస్తారో అనేది జగనే వివరించాలి..!