రాష్ట్రాల్లో ఎన్నికలు ముందుకు వస్తూంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది బీజేపీకి కఠిన పరీక్షలు ఎదురు కానున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలని బీజేపీ అనుకోవడం సహజం. అందుకే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి కొత్తగా కేంద్రమంత్రుల్ని తీసుకునే చాన్స్ ఉంది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను తప్పించి… ఆయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. మధ్యప్రదేశ్ కు కొత్త సీఎం నియమించనున్నారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ , కర్ణాటకల నుంచి కూడాకేంద్రమంత్రుల్ని చేర్చుకోబోతున్నారు. అసలు దేశంలో కేంద్రమంత్రి లేని రాష్ట్రం ఏపీ. చివరి ఏడాదిలో అయినా ఏపీకి కేంద్ర మంత్రి పదవిని కేటాయిస్తారని ఆశిస్తున్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడల్లా ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ ఎవరికీ పదవి దక్కలేదు.
ఈ సారి కూడా ఏపీకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని… చెబుతున్నారు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింంహారావుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జీవీఎల్ యూపీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు పదవి ఇస్తే యూపీ కోటా అవుతుంది. ఇటీవల బీజేపీ టీడీపీ వైపు మారకుండా ఉండటానికి… జగన్ పొత్తు ప్రస్తావన తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి బీజేపీ అంగీకరిస్తే.. కేంద్రమంత్రిగా వైసీపీ ఎంపీ ఉండే చాన్స్ ఉంది. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరగవచ్చని చెబుతున్నారు.