వైసీపీలో ఉన్న పార్టీ నేతలందరికీ న్యాయం చేయడానికి సీఎం జగన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా ఇచ్చిన ఆయన.. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనూ అదే పద్దతి పాటించాలని నిర్ణయించారు. అంటే.. మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు.. మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు… పద్దెనిమిదో తేదీన మేయర్, చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఆ పదవుల పంపకంపై సీఎం జగన్ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. పోటీ ఎక్కువగా ఉండటంతో రెండేసి డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్ ల ఫార్ములాని పాటించాలని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు ఆర్డినెన్స్ సిద్ధం చేశారు. ఏ క్షణమైనా గవర్నర్‌కు పంపి ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం ఉంది. రెండు మున్సిపాలిటీల్లో తప్ప.. అన్ని చోట్ల వైసీపీనే సులువుగా చైర్మన్ పీఠాన్ని గెల్చుకోనుంది. అయినప్పటికీ.. పార్టీ నేతలు నిరాశ పడకుండా పదవులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఉపసర్పంచ్‌ల ఎంపికల సమయంలో అలాంటి ఆలోచన రాకపోవడంతో.. వాటి గురించి ఆర్డినెన్స్‌లో చేర్చలేదు. ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రేపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. వాటి గురించి కూడా ఆర్డినెన్స్ లో పెట్టే అవకాశం లేదు. రేపు ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత అవసరం అయితే ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసే చాన్స్ ఉంది.