వైసీపీ ప్యాలెస్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. కొత్త జిల్లా కేంద్రాలన్నింటిలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాంకీ గ్రూప్ ఆ భవనాలను నిర్మిస్తోంది. అదంతా క్విడ్ పో కో. అయితే అసలు అనుమతులు తీసుకోపోవడం.. అసలు ట్విస్ట్. భూములు కేటాయింపు చేసుకున్నదానికంటే ఈజీగా అనుమతులు తీసుకోవచ్చు. కావాలంటే కట్టాల్సిన ఫీజులను మాఫీ చేస్తూ జీవో ఇచ్చుకుని అనుమతులు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి అక్రమాలు లక్షా తొంభై చేశారు. అలా చేసుకుని ఉంటే లక్షా తొంభై ఒక్కటి అయి ఉండేది. కానీ చేసుకోలేదు. నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఇప్పుడు ఆ భవనాల పరిస్థితి డొలాయమానంలో పడింది.
ఒక్క ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయానికి మాత్రమే అనుమతులు తీసుకున్నారు. ఇతర చోట్లా అలాంటి ప్రయత్నం చేయలేదు.. అందుకే ఇప్పుడు అన్ని వైసీపీ కార్యాలయాలకూ నోటీ సులు వెళ్లాయి. పర్మిషన్లు లేని భవనాలపై … పూర్తి వివరాలు వారంలో ఇవ్వాలని ఆదేశించారు. పర్మిషన్లు లేకుండా ఎందుకు కట్టారో చెప్పాలని స్పష్టం చేశారు. వారం గడువు ఇచ్చారు. ఈ లోపు పర్మిషన్లు రావు.. వచ్చినా చెల్లవు. పర్మిషన్ లేకుండా కట్టినందున అక్రమ కట్టడమే.
సీఎం హోదాలో జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం వాటన్నింటినీ కూల్చివేయాలి. ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుని వాటిలో అక్రమ కట్టడాలు నిర్మించినందున లీజును కూడా రద్దు చేయవచ్చు.. అయితే చంద్రబాబు ఆ భవనాలను కూల్చి వేయడానికి అంగీకరించకపోవచ్చని చెబుతున్నారు. వాటిని సీజ్ చేయడం లేదా.. భారీగా జరిమానా విధించి… కట్టకపోతే స్వాధీనం చేసుకోవడం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏ చర్యలు తీసుకుంటారన్నది వారం తర్వాత తేలే అవకాశం ఉంది.
జగన్ రెడ్డి కూల్చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ.. చంద్రబాబు హయాంలో అక్రమ కట్టడాలు కూల్చేసినా.. అదో పెద్ద ఉత్పాతం అన్నట్లుగా ప్రచారం చేసే వాళ్లు ఉంటారు. అందుకే వైసీపీ కార్యాలయాల విషయంలో చంద్రబాబు సర్కార్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారనుంది.