వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారితే దాదాపు వంద కోట్ల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో ఆఫర్ ఇచ్చారని, కానీ కన్నతల్లి లాంటి పార్టీని వీడకూడదు అనే ఉద్దేశంతో తాను పార్టీ మారలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన వాదన అంతా బానే ఉంది కానీ ఆయనకు కన్నతల్లి లాంటి పార్టీ ఏదని కొందరు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
గూడూరు ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్ ఒక మాజీ ఐఏఎస్. 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తిరుపతి ఎంపీగా ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా , చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలవడం తో ఆ నియోజకవర్గ బాధ్యతలు చాలా కాలం వరకూ ఆయనే చూసుకున్నారు.ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత వైఎస్సార్ సిపి లోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన ఫుల్లుగా మందు తాగి ఓట్లు అడుగుతున్న వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా ఆయన ఎన్నికల్లో గెలిచారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారని, పార్టీ మారితే 50 కోట్ల క్యాష్, 50 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇప్పిస్తామని వారు ప్రలోభ పెట్టారని, అప్పుడు లోకేష్ తో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడని పరోక్షంగా సీఎం రమేష్ ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. కానీ కన్నతల్లి లాంటి పార్టీని విడిచి పెట్టకూడదు అని తాను అనుకున్నానని ఆయన అన్నారు. అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలు అన్ని బాగానే ఉన్నప్పటికీ, డబ్బుకు ఆశపడి ఫిరాయించకుండా ఉండటం అభినందించదగ్గ విషయమే అయినప్పటికీ, కన్నతల్లి లాంటి పార్టీ అని ఆయన వైఎస్ఆర్ సీపీని ప్రస్తావించడమే కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐఏఎస్ గా ఉన్న ఆయనను రాజకీయ నాయకుడిగా మార్చింది ప్రజారాజ్యం పార్టీ. తిరుపతిలో ఆయన ఎంపీగా గెలవలేక పోయినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు చాలా వరకు ఆయన రూపొందించినవే. ప్రజారాజ్యం పార్టీ లో ఉన్న సమయంలో ఆయన పని చేసిన తీరు నచ్చడం వల్లనే ఆయనకు వైఎస్సార్సీపీ నుండి అప్పట్లో పిలుపువచ్చింది.
మరి గతం మరిచిపోయాడో, లేక తన కి అంత ప్రాముఖ్యత ఇచ్చిన పీఆర్పీ కంటే గెలుపునిచ్చిన వైకాపా ముఖ్యం అనుకున్నాడో కానీ, మొత్తానికి, కన్న తల్లి వైకాపా అని సెలవిచ్చారు.