నేర్చుకోవడం గురించి జగన్ రెడ్డి చెప్పిన మాటలు వైసీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ నాయకులకు న్యాయ సాయం అందించేందుకు వైసీపీ న్యాయవిభాగంతో సమావేశం అయ్యారు. వైసీపీలో సమావేశం అంటే.. అందరూ వచ్చి కూర్చుని ఎగ్ పఫ్లు తిన్న తర్వాత జగన్ రెడ్డి వచ్చి మాట్లాడి వెళ్లిపోతారు. ఇంటరియాక్షన్ లాంటివేమీ ఉండవు. ఇక్కడా అదే జరిగింది.
కాకపోతే లాయర్ల ముందు చేసిన ప్రసంగంలో జగన్ మార్పు చూపించారు. స్క్రిప్ట్ రైటర్ని మార్చారో.. లేకపోతే ఇప్పుడు జగన్ మారాల్సి ఉందని అందరూ అనుకుంటున్నారు కానీ మారుతానని సందేశం పంపాలని అనుకున్నారో కానీ.. కొత్త స్క్రిప్ట్ చదివారు. అందులో తాను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకుంటానని.. ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని లాయర్లు కూడా అవాక్కయ్యారు. ఆయన నేర్పడమే కానీ.. నేర్చుకోవడం ఎప్పుడు ఉందని సెటైర్లు వేసుకున్నారు.
జగన్ రెడ్డి తనను తాను మోనార్క్ అనుకుంటారు. రాసిచ్చినవి కూడా ముందుగా చదువుకునే అలవాటు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఐదేళ్ల పాలనలో తప్పటడుగులపై ఎంతో మంది ఎన్నో నేర్పే ప్రయత్నం చేశారు. పట్టించుకోకుండా తాను అనుకున్నదే చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అయ్యారు. ఇప్పుడు ఆయన నేర్చుకుంటానని చెప్పినా.. నేర్పేందుకు ఎవరూ సాహసించరు మరి.