అధికార పార్టీ నేతలు కట్టు తప్పితే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. అలా వెళ్తే వచ్చే ప్రయోజనం కన్నా జరిగే నష్టం ఎక్కువ. వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా చేస్తున్నారో… ఆవేశంలో అంటున్నారో కానీ… తమను వ్యతిరేకించిన వారందర్నీ గుడ్డలిప్పదీసి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఆయన స్పీకర్ అయినా… మేయర్ అయినా ఎవరి మాట తీరూ మారడం లేదు. ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారం ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని అందరూ ఆస్చర్యపోయారు. ఆయన వీడియో అలా సర్క్యూరేట్ అవుతూండగానే కర్నూలు మేయర్ జర్నలిస్టులపై రెచ్చిపోయారు. సామాజిక న్యాయభేరీ సభలకు జనాలు రాలేదని రాస్తున్నారని… జర్నలిస్టుల వీపు పగలగొడతామని హెచ్చరించారు. ఎండగా ుందని జనాలు నీడలోకి వెళ్లారని రాయాలని ఆయన తేల్చారు. జర్నలిస్టు సంఘాలు సహజంగానే… ఇష్టమైనోడు తిట్టినా సువాసనే అన్నట్లుగా ఉండిపోయాయి.
వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే మరో ఎమ్మెల్యే కూడా ఇదే తరహాలో బయటకు వచ్చారు. టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. వారిని ఇంటికి వెళ్లి గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరించారు. ఆయన మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నేతలు గతంలో కనిపించేవారు కాదు. అధికారం ఉందని దేనికైనా తెగించేందుకు సిద్ధపడుతున్న వైనం కనిపిస్తోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్టు వేయకపోతే.. రాజకీయ ఘర్షణలు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
రాజకీయాలను వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి తీసుకెళ్తున్న వైసీపీ నేతలు… ఇప్పటికిప్పుడు ఉన్న పరిణామాల గురించి ఆలోచిస్తున్నారు కానీ… తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనా వేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.