వైసీపీకి ఇది గడ్డుకాలమే. ప్రజలు ఇచ్చిన షాక్ కంటే.. జగన్ రెడ్డి ఇస్తున్న షాకులే ఆ పార్టీకి..క్యాడర్ కు పిచ్చి పట్టిస్తున్నాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత సర్దుకుని కాస్త పరుగెత్తాల్సి ఉన్నా.. అసలు పార్టీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అన్నట్లుగా ఉంటున్నారు. దానికి ఉదాహరణ పార్టీ ఆవిర్భావం. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఎప్పుడూ హాజరు కాలేదు. తల్లిని పార్టీ గౌరవాధ్యక్షరాలి పదవి నుంచి తీసేయాలనుకున్నప్పుడో.. తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించాలనుకున్నప్పుడో ఓ ప్లీనరీ పెడతారు. అంతే అవసరం లేకపోతే అసలు పట్టించుకోరు.
మార్చి పన్నెండో తేదీన వైసీపీ ఆవిర్భావ దినం. ప్రతిపక్షంలోఉన్నందున కనీసం ఉనికి చాటుకునేందుకు అయినా కాస్త గట్టిగా కార్యక్రమాలు చేస్తారని ఆ పార్టీ క్యాడర్ అనుకున్నారు. కానీ తాడేపల్లిలో జెండా ఎగరేయడం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చే వారితో కొన్ని ఎలివేషన్ పోస్టులు వేయించుకుని టైం పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీని యాక్టివ్ చేసుకోవడానికి..క్యాడర్ ను మళ్లీ ఉత్సాహపరచడానికి ఆవిర్భావం లాంటి కార్యక్రమాలు పనికి వస్తాయి. కానీ వైసీపీ హైకమాండ్ అలాంటివన్ని ఉత్త ఖర్చుతో కూడుకున్న పనులని కావాలంటే పార్టీ నేతలు చేసుకోవచ్చని సలహాలిస్తున్నారు.
ఓ వైపు జనసేన పార్టీని కించ పరుస్తున్న వైసీపీ.. ఇప్పుడు తన ఆవిర్భావాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో లేదు. కానీ జనసేన పార్టీ మాత్రం ధూం..ధాంగా ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహిస్తోంది. అంటే.. తమకన్నా ఎదిగిపోతున్న పార్టీని కించ పరిచి మానసిక ఆనందం పొందుతున్నారు కానీ.. తమను దాటిపోతున్న పార్టీని..తాము దాటాలంటే ఏం చేయాలో మాత్రం ఆలోచించడం లేదు. ఎదుటి వారిని కించపరిస్తే తాము ఎదిగిపోతామనుకునే భావజాలం ఉన్న పార్టీ ఎదుగుతుందా.. పాతాళానికి పడిపోతుందా ?