ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ప్రారంభమైంది. అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు, ఇంచార్జులు ఉండగా వారికి పోటీగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఓ పర్యవేక్షకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించడమే దీనికి కారణం. ఇప్పటికే జాబితా కూడా రెడీ అయిపోయిందని కానీ ప్రకటిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.
నియోజకవర్గాలకు అదనంగా ఇంచార్జుల్ని నియమించాలని పార్టీ అధినేత జగన్ పట్టుదలగా ఉన్నారు. అసంతృప్తి పెరుగుతుందని..గ్రూపుల గోల ఎక్కువ అవుతుందని ఇతర నేతలు చెబుతున్న విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పోటీ ఉండాలని అందుకే నియోజకవర్గానికి పర్యవేక్షకుల్ని నియమించాలని నిర్ణయించారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం ఈ సారి కూడా వైఎస్ఆర్సీపీకి సేవలు అందిస్తోంది. అయితే పీకే బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు . ఆయన తర్వాత స్థానంలో ఉన్న రిషిరాజ్ పీకే సలహాలతో ఇక్కడ స్ట్రాటజీల్ని అమలు చేస్తున్నారు. ఆయన తన టీములతో విస్తృతంగా నిర్వహిస్తున్న సర్వే రిపోర్టుల ఆధారంగానే జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. వారి సలహాతోనే నియోజకవర్గ ఇంచార్జుల్ని నియమించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
అన్ని చోట్లా సమన్వయకర్తల్ని నియమించాలని అనుకుంటున్నప్పటికీ ముందుగాఓ పది మందిని నియమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇలా నాన్చే రకం కాదని అన్ని స్థానాలకూ పరిశీలకుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే పులివెందులకు కూడా ఓ పర్యవేక్షకుడ్ని జగన్ నియమించాలన్న సెటైర్లు వైసీపీలో పడుతున్నాయి. మొత్తంగా జగన్ పాలనలోనే కాదు పార్టీలోనూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అంతర్గతంగా విమర్శించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.