కె.శివకుమార్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతకీ ఎవరు ఈ శివకుమార్..? ఎందుకు సస్పెండ్ చేశారు..?. ఈ శివకుమార్ ఎవరో కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన వ్యవస్థపకుడు. ఆయననే వైసీపీని స్థాపించారు. ఆయన దగ్గర్నుంచి.. జగన్మోహన్ రెడ్డి దాన్ని టేకోవర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి జెల్లకొట్టి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు… వైఎస్ఆర్ పేరు వచ్చేలా పార్టీ పెట్టాలనుకున్నారు. వైఎస్ఆర్ పేరు రావాలి కానీ.. అది యెదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి కాకూడదు. అందుకే.. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ .. అని పేరు పెడితే.. సరిగ్గా సరిపోతుదని… దాన్ని రిజిస్టర్ చేయాలనుకున్నారు. అయితే అప్పటికే.. శివకుమార్ అనే వ్యక్తి.. ఈ పార్టీని పేపర్‌పై ఏర్పాటు చేశారు. పార్టీలో గౌరవం.. ఎమ్మెల్సీ.. లాంటి పదవులు ఇస్తామని చెప్పి… ఆయన దగ్గర్నుంచి పార్టీని తీసుకున్నారు. ఆ తర్వాత ఈ శివకుమార్… వైసీపీ వ్యవహారాల్లో పెద్దగా కనిపించలేదు కానీ.. హఠాత్తుగా.. మంగళవారం బయటకు వచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యత తీసుకుని… కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ … తన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని.. ఆయన ఉన్నత శిఖరాలను కాంగ్రెస్‌లో అధిరోహిచారనేది.. శివకుమార్ భావన. అదే సమయంలో..తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. వైఎస్‌ను ఓ దుర్మార్గుడిగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నికల ప్రచారసభల్లో వైఎస్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే… శివకుమార్.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం లేదని… కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆయన అలా ప్రకటన చేసిన.,. వెంటనే వైసీపీ ఉలిక్కి పడింది. వెంటనే ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల్లో తమది.. న్యూట్రల్ విధానమని ప్రకటించుకుంది.
శివకుమార్ ప్రకటనపై వైసీపీ ఇంతగా ఎందుకు ఉలిక్కి పడిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన చెప్పినదాంట్లో అవాస్తవం కూడా ఏమీ లేదు. నిజానికి టీఆర్ఎస్కు వైసీపీ మద్దతు ఇస్తోంది. అదికారిక ప్రకటన చేయకపోయినా.. మొత్తంగా… టీఆర్ఎస్ను గెలిపించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు ఉన్నారు. ఈ విషయం బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటిస్తే.. ఏపీలో కష్టం కాబట్టి..అధికారిక ప్రకటన చేయడం లేదు.. తటస్థం అని చెబుతున్నారు. ఇది నచ్చక శివకుమార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైసీపీ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే సరిపోతుందేమో కానీ.. కాంగ్రెస్‌కు మద్దతు అనగానే.. శివకుమార్ ను గెంటేయడం ఎందుకో.. మరి.. ?