వైసీపీ కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని మంత్రి ధర్మాన అంటే… త్వరలోనే వారి కోసం జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇస్తున్నారు. కార్యకర్తల అసంతృప్తి గురించి ధర్మాన బయట పడి ఉండవచ్చు కానీ.. నిజానికి వైసీపీలో ఈ చర్చ గత ఏడాది నుంచి ఉంది.పదేళ్ల పాటు జగన్ కోసం కష్టపడితే..అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదనేది కార్యకర్తల వాదన. గతంలో జగన్ చెప్పినట్లుగా మన ప్లేట్లో.. మన బిర్యానీ పథకం.. పెద్దలకు మాత్రమే అమలవుతోందని.. అధికారం చేతికందిన తర్వాత… ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి దక్కిన ప్రయోజనం కూడా తమకు అందడం లేదనే భావన కార్యకర్తలలో పెరిగిపోయింది.
కొంత మంది నేతలు కళ్ల ముందు కుబేరులవుతున్నారు. కానీ జెండా మోసిన తాము మాత్రం.. అలాగే ఉండిపోయామని వారి వేదన. ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్లు.. ఈ ఆవేదనను.. ఏదో విధంగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే… ఈ అసంతృప్తి గురించి అందరికీ తెలుసు. నిన్నామొన్నటిదాకా పార్టీ వ్యవహారాలు చూసి.. ప్రస్తుతం కూడా సోషల్ మీడియాను డీల్ చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. అందుకే ఆయన .. కార్యకర్తల అసంతృప్తిని గుర్తించినట్లుగా అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. దాంతో పాటు వారి కోసం ఏం చేస్తానో కూడా చెబుతూంటారు.
విజయసాయిరెడ్డి.. వారికి కాంట్రాక్టులు ఇస్తామని.. ఆర్థికంగా ఉన్నత స్థితికితెస్తామని చెప్పడం లేదు. జాబ్ మేళాలు పెడతామని ఉద్యోగాలిప్పిస్తామని చెబుతున్నారు. గతంలోనూ.. సోషల్ మీడియా కార్యకర్తలకు.. విశాఖ ఫార్మాసిటీలో ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళంలోనూ… అలాంటి మాటే చెప్పారు.స్థానిక ఎన్నికలకు ముందే కార్యకర్తలకు ఉద్యోగాలిప్పిస్తామనిచెబుతున్నారు. ఉద్యోగాలు చేయాలనుకుంటే.. వారందరూ ఎప్పుడో సీరియస్‌గా ప్రయత్నించి ఉద్యోగాలు చేసుకునేవారని.. వైసీపీ కోసమే వారు ఆ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని.. రాజకీయంగా వారు ప్రాధాన్యత కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం.. వారి అసంతృప్తి ఉద్యోగాల కోసమేనన్నట్లుగా ఉన్నారు. ప్రకటనలే చేస్తున్నారు.