పవన్ కల్యాణ్ ఎప్పుడు ప్రసంగించినా కంటిన్యూటీ మిస్ అవుతుందేమో కానీ ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తూనే ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రశ్నిస్తారు. చేస్తున్న తప్పును ఎత్తి చూపుతారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలనే నమ్ముకుంటోంది. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం అంటే.. కులాన్ని టార్గెట్ చేయడమన్నట్లుగానే వైసీపీ వ్యవహరిస్తోంది. పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నానిని మాత్రమే రంగంలోకి దింపుతారు. ఆయన పవన్ సామాజికవర్గం అయినా.. కులం టార్గెట్‌గా విమర్శలు చేస్తూంటారు.
ఆదివారం కూడా అంతే. అలా పవన్ ప్రసంగం ముగియగానే ఇలా.. పేర్ని నాని వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ ప్రశ్నించిన అనేక అంశాలపై ఆయన మాట్లాడలేదు. రాజధానిపై ఎందుకు మాటతప్పారంటే సమాధానం లేదు. శాంతిభద్రతల అంశం.. అప్పులు.. . పేదల కష్టాలు ఇలా ఏ అంశంపైనా స్పందించలేదు. కానీ .. చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడిచాజంటూ కొత్త వాదన వినిపించారు. చిరంజీవిని జగన్ అత్యంత దారుణంగా అవమానించేలా చేయడంలో పేర్ని నాని పాత్ర కీలకం. చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేసిందెవరైనా ఉందంటే అది వైసీపీ నేతలే. ఇప్పుడు అేద చిరంజీవిని అడ్డం పెట్టుకుని పవన్‌పై వ్యక్తిగత దాడికి సిద్ధమవుతున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ నేత. ఆయన తన రాజకీయం తాను చేసుకుంటారు. అలా చేసుకోకుండా తమను అనుకూలమైన మార్గంలో నడిచేలాచేసుకోవాలని వైసీపీ ప్రయత్నం. అందు కోసమే వ్యక్తిగత దూషణలు.. సవాళ్లకు దిగుతోంది. కానీ అది రాజకీయం కాదు. పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే రాజకీయం. అదెప్పుడో మారిపోయింది. చంద్రబాబుతో పవన్ ఎక్కడ కలుస్తాడోనన్న కంగారు.. అలా కలవకుండా ఆపడమే తమ లక్ష్యమన్నట్లుగా వారి తీరు ఉంది.