నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం విశేషం! అధికార పార్టీ తెలుగుదేశం అభివృద్ధి పేరుతో భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నా, భూమా నాగిరెడ్డి సెంటిమెంట్ తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఉంది. అందుకే కదా, ఏరికోరి మరీ అదే కుటుంబానికి చెందిన బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఇక, వైకాపా విషయానికొస్తే… ప్రభుత్వ వ్యతిరేకతను భారీగా ప్రచారం చేసుకుంటోంది. దీంతోపాటు, భూమా సెంటిమెంట్ మీదే ఆ పార్టీ కూడా ఫోకస్ మార్చినట్టు కనిపిస్తోంది. అదే సెంటిమెంట్ ప్రయోగించడం ద్వారా టీడీపీలోకి మారిన భూమా వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది.
సాంకేతికంగా చూసుకుంటే గత ఎన్నికల్లో నంద్యాల సీటు వైకాపాకి వచ్చింది. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించినా, ఆయన రాజీనామా చెయ్యలేదు, కాబట్టి ఇప్పటికీ అది వైకాపా స్థానం అనడంలో సందేహం లేదు. కాబట్టి, భూమా వర్గం టీడీపీలో చేరిపోయినా, ఇప్పటికీ వైసీపీ అభిమానులు ఉంటారనీ, వారిని తమవైపు మళ్లించుకోవాలనే ఉద్దేశంతోనే భూమా సెంటిమెంట్ ను వాడుకుంటోంది. భూమా నాగిరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ తాజాగా అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ మారితే పదవి ఇస్తానని ఎరజూపి భూమాని ఆకర్షించారనీ, కానీ మారిన తరువాత ఇచ్చిన హామీ వదిలేశారన్నారు. భూమా నాగిరెడ్డిని మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మరోసారి నంద్యాల ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. సొమ్ముతో నంద్యాల ప్రజల్ని కొనలేరని అన్నారు. ఒక ఎమ్మెల్యే మరణిస్తే.. ఆ స్థానంలో ఉప ఎన్నిక పేరుతో పోటీ పెట్టే సంప్రదాయం గతంలో ఎప్పుడూ లేదనీ, దీనికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారంటూ మరో నేత కన్నబాబు మండిపడ్డారు.
భూమా ఇప్పటికీ వైకాపా ఎమ్మెల్యే అనే వాదనను జనంలోకి బలంగా తీసుకెళ్లబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తరుణంలో ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో ఏకగ్రీవం చేయడం అనే సంప్రదాయానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు అనే పాయింట్ ను కూడా ప్రచారాస్త్రంగా వైకాపా మార్చుకుంటోంది. పదవి ఇస్తానని ఆశ చూపి భూమాని పార్టీలోకి పిలిచి, తరువాత మాట తప్పారంటూ ముఖ్యమంత్రి తీరుపై మండిపడే ప్రయత్నం చేస్తోంది! నిజానికి, ఈ మూడు అంశాలూ భూమా నాగిరెడ్డికి సంబంధించినవే కావడం గమనార్హం! భూమా మరణం తరువాత ప్రజల్లో వ్యక్తమౌతున్న సానుభూతి తమకు అనుకూలిస్తుందని టీడీపీ భావిస్తుంటే… పార్టీ మారిపోయినా కూడా భూమా సెంటిమెంటే తమకూ వర్కౌట్ అయ్యేలా పరిస్థితుల్ని మలచుకోవాలని వైకాపా కూడా చూస్తుండటం విశేషం!