వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షంగా.. రాజ్యాంగ పరమైన విధుల కన్నా.. వచ్చే ఎన్నికల తర్వాత.. అధికార పార్టీగా ఎలా మారాలన్న అంశంపైనే గత నాలుగున్నరేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ప్రజాసమస్యలపై కన్నా.. టీడీపీని రాజకీయంగా కౌంటర్ చేసి.. ప్రజల్లో వ్యతిరేకత పెంచి… ఆ ఫలాన్ని తన పార్టీకి అధికార హోదా తీసుకొచ్చి.. తాను ముఖ్యమంత్రి అయ్యేలా చేసుకోవాలన్న ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఆయన సన్నాహాలు కూడా చివరి దశకు వచ్చాయని చెప్పుకోవచ్చు.
అభ్యర్థులపై గందరగోళంతో కూడిన క్లారిటీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు వెళ్లిన ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థుల్ని ఖరారు చేసి.. ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు..మరో అడుగు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అగ్రనేతల నియోజకవర్గాల్లో అభ్యర్థులు వారే అవుతారా లేదా అన్న క్లారిటీ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు.. అభ్యర్థుల్ని మార్చేస్తూ.. సమన్వయకర్తల్ని కొత్త వారిని తెచ్చి .. పాదయాత్ర సమయంలోనే దాదాపుగా 30 నియోజకవర్గాల్లో గందరగోళంగా సృష్టించుకున్నారు. కొత్తగా అవకాశం పొందిన వాళ్లు .. ఏ మాత్రం రాజకీయంగా బలవంతులు కాకపోవడంతో.. జగన్ ఏం చేయాలనుకుంటున్నారో పార్టీ నేతలకు ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది. అదే సమయంలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లకు కూడా.. ఇప్పటి వరకూ.. ఏ సీటు ఇస్తారో క్లారిటీ లేదు. పాదయాత్రలో చీపురుపల్లి వెళ్లినా కనీసం బొత్స ప్రస్తావన తేకుండానే దాటిపోయారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కానీ.. క్లారిటీ వచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. తను అనుకున్నట్లుగా చేసి చూపించారు. విజయవాడ సెంట్రల్ లో రాధాకృష్ణను తప్పించి.. మల్లాది విష్ణుకు ఇవ్వాలనుకున్నారు. ఇచ్చేశారు. కానీ రాధాకృష్ణకు ఎక్కడా సర్దుబాటు చేయలేదు. ఆ సమస్య అలా ఉండిపోయింది. ఇలా.. వైసీపీ అభ్యర్థులపై… గందరగోళంతో కూడిన క్లారిటీ ఉంది. ఆరవై రోజుల్లో గందరగోళాన్ని తప్పించుకోకపోతే.. ఎన్నికల్లో వైసీపీతో .. వైసీపీనే పోటీ పడాల్సి రావొచ్చు.
Click here for : ఎలక్షన్ కౌంట్‌డౌన్ 60 : సమర సన్నాహాల్లో టీడీపీ ముందడుగు వేసిందా..?
పాదయాత్రే ఏకైక పోరాటం..!
ప్రతిపక్ష పార్టీగా.. జగన్… ఏ ఇతర కార్యక్రమాలు పెట్టుకోలేదు. ఒక్క పాదయాత్ర మాత్రమే… చాలు అధికారంలోకి రావడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లడం లేదు. పార్లమెంట్ కు వెళ్లడం లేదు. పార్టీ నేతలంతా… కామ్‌గా ఉంటున్నారు. కానీ ఒక్క జగన్ మాత్రమే… పాదయాత్ర చేస్తూ.. బండి నడిపిస్తున్నారు. ఇతర నేతలకు.. ఏమైనా కార్యక్రమాలను ఎసైన్ చేసినా.. వాటిని చేసేవారు.. వైసీపీ లేరు. వాస్తవంగా చెప్పాలంటే.. నాలుగున్నరేళ్ల కాలంలో.. ప్రభుత్వంపై నిఖార్సుగా చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఏది చేపట్టినా… విమర్శలు చేయడం.. అవినీతి ఆరోపణలు చేయడమే ఎజెండాగా నడిచింది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని… అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ నేతలు ఎదురు దాడి చేసినా… కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. అయినా… పాదయాత్ర ద్వారా ప్రజల్లో పలుకుబడి సాధించామని వైసీపీ భావిస్తోంది.
వైఎస్ బ్రాండ్ సంక్షేమమే తురుపు ముక్క..!
ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించే సంక్షేమ పథకాల్లో… వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఓ రికార్డు. ఆయన పథకాల వల్ల ప్రయోజనం పొందిన వారు.. తనకు అండగా ఉంటారని.. జగన్ భావిస్తున్నారు. అయితే.. ఇలా ప్రయోజనం పొందిన వారిని నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా పోయింది వైసీపీ నేతలకు. దానికి అంత సమయం లేదు. అయితే వారంతా.. తమకు కృతజ్ఞతగా ఉంటారని మాత్రం… గట్టిగా నమ్ముతున్నారు. ఆ తరహాలోనే నవరత్నాల పేరుతో పథకాలకు చేస్తున్న ప్రచారం ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అన్నొస్తున్నాడు పేరుతో..నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
వైసీపీ కూడా.. ఎన్నికల కోసం..ఓ రకంగా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుందనే చెప్పాలి. అరవై రోజుల వ్యవధిలో… మిగతావి కూడా పూర్తి చేసుకోవచ్చు. జనవరి ఎనిమిదో తేదీన పాదయాత్ర పూర్తవుతుంది. అప్పటికే ఎన్నికల వేడి వచ్చేస్తుంది. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం పేరుతో బస్సుయాత్ర ప్రారంభించి జగన్.. ఎన్నికల సమరాన్ని పోలింగ్ తోనే ముగించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అంటే.. సర్వశక్తులతో సిద్ధం అయినట్లే..!
–సుభాష్