అమరావతి రైతుల పాదయాత్రకు పెద్ద ఎత్తున జన స్పందన వస్తూండటంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. అది టీడీపీ యాత్ర అని ఎంతగా ప్రచారం చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. పాదయత్ర ఎక్కువగా గ్రామాల గుండానే వెళ్తోంది. ప్రతీ గ్రామంలోనూ రైతులకు అక్కడి రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారు. రైతుల పాదయాత్రకు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. పార్టీలు, ప్రజాసంఘాలు.. ఇలా అన్నీ రాజధానికి మద్దతు ప్రకటించాయి. దీంతో వైసీపీలో వణుకు ప్రారంభమయింది.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలోనూ రైతుల పాదయాత్రకు విశేషమైన మద్దతు లభిస్తే ఇక మూడు రాజధానులకు విలువ లేకుండా పోతుంది. అందుకే వైసీపీ సిద్ధాంతకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే నిద్రలేచారు. అన్ని జిల్లాల పార్టీ ల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మేధావులతో చర్చా కార్యక్రమాలు పెట్టాలని సూచించారు. రాజమండ్రి, కాకినాడల్లో పెట్టినట్లుగా పెట్టాలని సూచించారు. ఇప్పటికే విశాఖలో మంత్రి అమర్నాత్ రౌండ్ టేబుల్ భేటీ నిర్వహించారు. ఇలాంటివి నిర్వహించాలని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వారిని తీసుకొచ్చి మాట్లాడించాలని చెబుతున్నారు.
మరో వైపు రోజుకొక నేతలతో అమరావతి రైతుల పాదయాత్రకు హెచ్చరికలు జారీ చేయిస్తున్నాయి. పాదయాత్రపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టవద్దని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే పాదయాత్రను అడ్డుకోవాలన్న ప్రణాళికలు వేస్తున్నట్లుగా ప్రకటనలు ఉంటున్నాయి. నిజానికి పాదయాత్రలో ఎక్కడా స్వల్ప ఉద్రిక్తతలు కూడా ఉండటం లేదు. గుడివాడలో మాత్రం పోలీసులు హడావుడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ నేతలు పాదయాత్రపై కుట్రలు చేయాలని ఆలోచిస్తున్నారని రైతులు అనుమానపడుతున్నారు.
అయితే పాలకపార్టీగా ఉండి.. పాదయాత్రను అడ్డుకుంటే ఏం జరుగుతుందో వైసీపీ పెద్దలకు తెలియనిదేం కాదు. ఏం జరిగినా హైకోర్టు అనుమతి ఉన్నందున పాదయాత్ర ఆగదు. కానీ చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఇచ్చిన బెదిరింపులు ఉన్నాయి. అయితే ఇలాంటి బెదిరింపుల తర్వాత కూడా పాదయాత్ర సాఫీగాసాగితే వారి వాదన తేలిపోతుంది. అందుకే వైసీపీ కొత్త ప్లాన్లేస్తుంది. వారి బ్రెయిన్ ఎలా ఉంటుదో అంచనా వేయడం కష్టం కాబట్టి … ఆ ప్లాన్లు ఏమిటనేది జరిగిన తర్వాతే తెలుస్తుంది.