విశాఖ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని కార్పొరేటర్లను క్యాంపునకు తీసుకెళ్లి .. అవిశ్వాసంపై ఓటింగ్ సమయానికి కూడా వారిని తీసుకు రాకుండా వైసీపీ పరువు పోగొట్టుకుంది. వారు తీసుకు రానంత మాత్రాన అవిశ్వాసంపై ఓటింగ్ ఆగలేదు. కూటమికి మేయర్ ను దింపేయడానికి అవసరమైన మద్దతు ఉంది. దాంతో వారు పని పూర్తి చేశారు. కనీసం ఎన్నికకు రాకుండా వైసీపీ నేతలు వేసిన వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది. క్యాంపుల కోసం పెట్టుకున్న ఖర్చు వృధా అయింది.
మేయర్ పై అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు కావాలి. ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కూటమికి దానికి తగ్గ ఓట్లు వచ్చాయి. అవంతి శ్రీనివాస్ కుమార్తె, తిప్పల నాగిరెడ్డి కుమారుడు అవిశ్వాసానికి మద్దతుగా ఉండటంతో వైసీపీ చేయాలనుకున్నది రివర్స్ అయింది. కనీసం కోరం లేకుండా చేద్దామని .. అలా చేయడం ద్వారా ఎన్నిక అయినా వాయిదా వడేలా చేయాలని వైసీపీ అనుకుంది. ఇందు కోసం కన్నబాబు, బొత్స, గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగారు. వీరంతా సవాళ్లు మీద సవాళ్లు చేశారు. కానీ అవన్నీ ఉత్త మాటలేనని తేలిపోయాయి.
ఇప్పటి వరకూ ఫిరాయించని కార్పొరేటర్లను తీసుకెళ్లి క్యాంపుల్లో ఉంచారు. దీంతో మేయర్ పై అవిశ్వాసం నెగ్గడానికి కావాల్సినంత సపోర్టు ఉండదనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇప్పుడు ఆ కార్పొరేటర్లు క్యాంపులో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లుగా మారిపోయిది. కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వైసీపీ మేయర్ ను ఇంటికి పంపేశారు. త్వరలో మేయర్ ఎన్నికను కలెక్టర్ నిర్వహించే అవకాశం ఉంది.