” నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. మీరు లేకపోతే తాను లేను. ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం” ఇది పీఆర్సీ విషయంలో కొత్తగా సాధించిన విజయాల కారణంగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లిన ఉద్యోగ సంఘ నేతలతో సీఎం జగన్ అన్నమాటలు. ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ ఇంకా చాలా చెప్పారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఉద్యోగుల ఉద్యమం జరిగినంత కాలం వైసీపీ నేతలు.. వైసీపీ మీడియా చేసిన ప్రచారమే ఇప్పుడు హైలెట్ అవుతోంది.
వైసీపీ నేతలు ఉద్యోగుల్ని నానా మాటలన్నారు. లంచాలు తీసుకుంటారన్నారు. లక్షలు జీతాలు సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారయితే మేం జీతాలు తీసుకోకుండా పని చేస్తాం.. మీరు సిద్ధమా అని సవాల్ కూడా చేశారు. ఇక ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగుల మీద లేనిపోని విషయాలు చెబుతూ ఇంటింటికి ప్రచారం చేసింది. వాలంటీర్లతో వారు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రచారం చేసింది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్పారు. ఉద్యోగులపై ప్రజల్లో తిరుగుబాటు తీసుకు రావాలని చూశారని ఆరోపించారు.
ఇక వైసీపీ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. ఉదయమే కొమ్మినేని శ్రీనివాసరావు చర్చా కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం అర్థరాత్రి వరకూ సాగుతుంది. మధ్యంలో కామన్ మ్యాన్ వాయిస్ అంటూ వైసీపీ నేతల వాయిస్‌ను వినిపిస్తూ ఉండేవారు. అంటే ఉద్యోగులపైవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి మాత్రం ఉద్యోగులంటే ప్రభుత్వం అంటారు. ఈ డబుల్ మీనింగ్ వ్యవహారాలకు అర్థం ఏమిటో సామాన్య ఉద్యోగులకు అర్థం అయింది కానీ.. ఉద్యోగ సంఘం నేతలకు అర్థం అయినట్లుగాలేదు. వారికి అర్థం అయినా … అర్థం కానట్లు ఉంటారని.. అదే స్ట్రాటజీ అని ఉద్యోగులు అనుకున్నా.. అందులో తప్పేం లేదు.