ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తొలగించి కొత్త ఎస్ఈసీగా కనగరాజ్‌ను నియమించడంపై దాఖలైన పిటిషన్ల విషయంలో ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన సమయంలోగా కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. హైకోర్టు ఇచ్చిన మూడు రోజుల గడువు గురువారంతో ముగిసింది. అయితే.. మరో రెండు రోజుల గడువు కావాలని.. విజ్ఞప్తి చేసుకున్నారు. శనివారం సాయంత్రంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది రిజిస్ట్రార్ జ్యుడీషియరికి మెయిల్ ద్వారా తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి ఆర్డినెన్స్, జీవోలు, కొత్త ఎస్ఈసీ నియామకాన్ని గంటల్లోనే.. శరవేగంగా పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే..ఆ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మూడు రోజులు గడువు ఇచ్చినా దాఖలు చేయలేకపోయింది.
న్యాయసమీక్ష ముందు ఎస్ఈసీ తొలగింపు, కొత్త నియామకం నిలబడటం సాధ్యం కాదని.. న్యాయనిపుణుల నుంచి ఏకాభిప్రాయం వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. టీడీపీతో కలిసి ఎన్నికలను వాయిదా వేశారని.. చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డికి డీజీపీ ఓ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వెనుక టీడీపీ ఉందని విచారణ చేయించాలని ఆ లేఖ సారాంశం. దానిపై విచారణ ప్రారంభిస్తే.. ఆ విషయాన్నే కోర్టులో చెప్పాలన్న ఆలోచనతోనే ఆ లేఖ రాశారన్న ప్రచారం జరిగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తానే ఆ లేఖ రాశానని.. ప్రకటించేశారు. ఆయినా ఆ తర్వాత కూడా.. ఆ లేఖపై సంతకం ఎవరిది..? లేఖను ఎవరు డ్రాఫ్టింగ్ చేశారు..? ఏ కంప్యూటర్ నుంచి పంపించారు..? అంటూ.. విచిత్రమైన అనుమానాలను వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయాల వెనుక టీడీపీ ఉందని… చెప్పడం ద్వారా… ఆయనను తొలగించేందుకు తాము తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాల్లో డిఫెండ్ చేసుకునే ప్రయత్నాన్ని అధికార పార్టీ చేస్తోందన్న అభిప్రాయాలు .. ప్రతిపక్ష పార్టీల నేతల్లో వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిని .. రాజ్యాంగ విరుద్ధంగా తొలగించడమే కాకుండా.. రాజకీయ దురుద్దేశాలు అంటగట్టేలా కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే.. విజయసాయిరెడ్డి… డీజీపీకి రాసిన లేఖలో తమ పేర్లను పెట్టడంపై.. కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ .. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.