తెలుగుదేశం పార్టీలో మరో ఫిరాయింపు కుదుపు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది! ఇన్నాళ్లకు తన పంతం నెగ్గించుకుని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి. ఫిరాయింపుల నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వైకాపా నుంచీ టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి వర్గం మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకోకూడదంటూ మొదట్నుంచీ రామసుబ్బారెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఏదో ఒకలా నచ్చజెప్పొచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు లైట్ తీసుకుని, ఆదినారాయణ రెడ్డి చేరికకు జెండా ఊపారు. అయితే, ఈ విషయమై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించడం కోసం ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు. కానీ, తరువాత ఎమ్మెల్సీ పదవి కావాలని మెలిక పెట్టారు. ఏదైతేనేం, అనుకున్నది సాధించుకున్నారు. కానీ, ఇక్కడి నుంచే అసలు కథ మొదలయ్యే అవకాశాలున్నాయి!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం ఉంటుందా… అంటే, చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికే ఛాన్సులు ఎక్కువ. ఆయన్ని కాదని రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారే అవకాశాలు కచ్చితంగా ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఆ వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్సీ సీటు కోసం గట్టి ప్రయత్నం చేసి దక్కించుకున్నారనీ అంటున్నారు. ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితే వస్తే.. కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని వదులుకోవాల్సి వస్తుందనీ, అదే ఎమ్మెల్సీ అయితే అలాంటి ఇబ్బంది ఉండదనే ఆలోచనతోనే దాన్ని దక్కించుకున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైకాపా కూడా సిద్ధమౌతున్నట్టు సమాచారం. రామసుబ్బారెడ్డి వైకాపాకు వస్తే, ఆయనకు సీటు ఇచ్చేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వైకాపాలోకి వెళ్తే… తనతో పాటు వచ్చే అనుచరుల్ని చివరి వరకూ కాపాడుకోవడం కాస్త కష్టంగా మారొచ్చనీ, కొన్నాళ్లు వేచి చూసిన తరువాత పార్టీ మారితే బాగుంటుందనేది వైకాపా నుంచి రామసుబ్బారెడ్డికి వచ్చిన సలహాగా తెలుస్తోంది! కానీ, ఇప్పటికే అనుచరుల నుంచీ పార్టీ మార్పుపై ఆయనపై ఒత్తిళ్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయనీ, వాటి తీవ్రత మరీ ఎక్కువైతే వైకాపాలోకి ఇప్పుడైనా చేరడానికి సిద్ధం అన్నట్టుగా రామసుబ్బారెడ్డి అభిప్రాయం ఉందని తెలుస్తోంది. అయితే, రామసుబ్బారెడ్డి విషయంలో టీడీపీ అభిప్రాయం మరోలా ఉంది. ఆయన కోరినట్టుగానే ఎమ్మెల్సీ పదవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారనీ, సీఎం సూచనలకు ఆయన కట్టుబడి ఉంటారనే ధీమా వారి నుంచీ వ్యక్తమౌతోంది.